రాజధానిపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. తెదేపా నేతలు రైతుల నిరసనల్లో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. గుంటూరు జిల్లా పెదపరిమిలో రైతులు చేపట్టిన దీక్షలకు ప్రత్తిపాటి పుల్లారావు, శ్రావణ్ కుమార్ సంఘీభావం తెలిపారు. ఓ సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. సీఎం జగన్ వేసే కమిటీలకు విశ్వసనీయత లేదని ఎద్దేవా చేశారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తే ప్రకాశం జిల్లా తీవ్రంగా నష్టపోతుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లా నేతలు శిద్దా రాఘవరావు, దామచర్ల జనార్దన్, ఎమ్మెల్యే కరణం బలరాంతో కలిసి రైతులకు మద్దతుగా దీక్షల్లో పాల్గొన్నారు. రైతుల పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే
ఎమ్మెల్యే మద్దాలి గిరి సీఎం జగన్‌తో భేటీ కావడాన్ని తెదేపా నేతలు తప్పుపట్టారు. రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే వైకాపా నేతలు మద్దాలి గిరిని తమవైపు తిప్పుకున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులు విషయంలోనూ సీఎం మాట తప్పారని మండిపడ్డారు. సీఎం రాసిచ్చిన స్క్రిప్టునే మద్దాలి గిరి చదువుతున్నారని బొండా ఉమ విమర్శించారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను హంతకులుగా చిత్రించడం ప్రభుత్వ దమనకాండకు పరాకాష్ఠ అని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు నిద్రహారాలు లేకుండా చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు.
అన్నదాతలను అవమానాలా..?
అమరావతి రైతుల గురించి అవమానకరరీతిలో మాట్లాడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఐకాస నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైతులను హేళన చేసి మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణారెడ్డి.. రాజీనామా చేయాలని తెదేపా అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :