అమరావతి ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం వద్ద మీడియా వాహనంపై దాడి చేసిన కేసులో ఏడుగురు రైతులను అరెస్ట్ చేయడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రైతుల విషయంలో ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. వేధింపులు, అణచివేతలతో ఉద్యమాలను ఆపడం ఎవరి వల్లా సాధ్యం కాదని.. చరిత్రలో నియంతలెవరూ ప్రజా ఉద్యమాల ముందు నిలవలేకపోయారని తెలిపారు. రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆక్షేపించారు. రాజధాని రైతులను అరెస్టు చేసిన తీరును నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి, పొలిటికల్ జేఏసీ నేతలు గుంటూరు రేంజి ఐజిని కలిసి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న రైతులను వేధించాలని చూస్తే ఊరుకోమని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు హెచ్చరించారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ కల్పిస్తామని చెపుతున్న వైకాపా ప్రభుత్వం... తెదేపా మహిళా నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా..మీడియాపై దాడి కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు రాజధాని రైతులకు తెనాలి ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం రైతులను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టే అవకాశం.
రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలపై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. కొంతమంది రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొడుతున్నారని అన్నారు.