రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 85ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నవంబర్ 20న విడుదలైన ఈ జీవో విద్యా హక్కు చట్టం 2009 నిబంధనలు, బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరించేలా ఉందంటూ.... సామాజిక ఉద్యమకారుడు రాంబొట్ల శ్రీనివాస సుధీష్ ఈ పిటిషన్ వేశారు. ఆర్టికల్ 21-ఏ, విద్యాహక్కు చట్టం సెక్షన్ 29-2 ఎఫ్ ప్రకారం... పిల్లలకు బోధించే మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలో ఉండాలన్నారు. జీవోరద్దు కోరుతూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, పాఠశాల విద్యా కమిషనర్, రాష్ట్ర ఎడ్యుకేషనల్ రీసెర్చ్, శిక్షణ, కౌన్సిల్ అధ్యక్షుడు, కేంద్ర మానవ వనరుల శాఖ కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.
ప్రభుత్వానికి అధికారం లేదు
ఆంగ్ల మాధ్యమం తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ రాంబొట్ల పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంఖ్యపై కసరత్తు చేయకుండానే ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారని ధర్మాసనానికి వెల్లడించారు. తెలుగు మాధ్యమం లేకుండా చేయడమంటే విద్యార్థుల హక్కుల్ని హరించడమేనని అభిప్రాయపడ్డారు. ఆంగ్లంపై పట్టులేని తల్లిదండ్రులు పిల్లలకు సరైన మార్గదర్శకం చేయలేరని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధన తెలుగులోనే ఉండాలన్నారు.
ఇదీ చూడండి: