మాతృభాష పరిరక్షణ, నదుల సంరక్షణ కోసం తమ పార్టీ తరపున 'మన నుడి- మన నది' పేరిట కార్యక్రమం చేపట్టబోతున్నట్లు... జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ విషయంపై మేధావులు, నిపుణులతో చర్చించామన్నారు. నదిలేనిదే నాగరికత లేదని... భాష లేనిదే సంస్కృతి లేదని పవన్ అభిప్రాయపడ్డారు.
మన భాషా మూలాల్ని మనమే నరుక్కుంటున్నామని... మాతృభాషను కాపాడుకోకపోతే సంస్కృతికి దూరమవుతామని పేర్కొన్నారు. నాగరికతకు నది పుట్టినిల్లని... మనిషి మనుగడకూ నదులు కీలకమని అన్నారు. జీవనాధారమైన నదుల్ని చేతులారా విషమయం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మాతృభాషను, నదులను కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని భాగస్వాములు చేసేలా 'మన నుడి- మన నది' కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.