రాజధానిలో అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టుని సింగపూర్ రద్దు చేసుకోవటంతో రాష్ట్ర ప్రజల కలలు కల్లలయ్యాయంటూ తెదేపా అధినేత చంద్రబాబు ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణంలో కలిసి పనిచేయటానికి సింగపూర్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిందన్నారు. ఇప్పుడు ఆ కలలన్నీ చెదిరిపోయాయని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు వెళ్లిపోయి, నమ్మకం అదృశ్యమైందని పేర్కొన్నారు. అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు సింగపూర్ మంత్రి విడుదల చేసిన ప్రకటన ప్రతిని చంద్రబాబు తన ట్వీట్‌కు జత చేశారు.
మిషన్ బిల్డ్ ఏపీ కాదు... మిషన్ ఎండ్ ఏపీ
ముఖ్యమంత్రి జగన్‌ను తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విటర్ వేదికగా విమర్శించారు. "ముఖ్యమంత్రి జగన్‌ది మిషన్ బిల్డ్ ఏపీ కాదు... మిషన్ ఎండ్ ఏపీ అన్న విషయం సింగపూర్ ప్రభుత్వానికి కూడా అర్థమైపోయింది" అని ఎద్దేవా చేశారు. అమరావతి అభివృద్ధికి ఎంతగానో సహకరించిన సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు రద్దు చేసుకోవటం చేతగాని ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అంటూ దుయ్యబట్టారు.
నమ్మకాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారు
అంకుర ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి సింగపూర్ సంస్థల కన్సార్షియం వైదొలిగిన విషయంపై మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థల ఛైర్మన్, ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్ దాస్ పాయ్ ట్విటర్లో తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏపీపై పెట్టుబడుల నమ్మకాన్ని చేజేతులా నాశనం చేస్తున్నారని ఆరోపించారు. సింగపూర్ సంస్థల కన్సార్షియం వైదొలగడం రాష్ట్రానికి దుర్వార్త అని అభిప్రాయపడ్డారు.
సంబంధిత కథనం