గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలో గుండెపోటుతో మృతి చెందిన రైతు కృపానందం కుంటుంబాన్ని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ఆ పార్టీ నేతలు పరామర్శించారు. కృష్ణాయపాలెంలో పర్యటించిన లోకేశ్.... రైతు మృతదేహానికి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని రైతు శవపేటిక మోశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. రాజధాని తరలిపోతుందన్న ఆవేదనతో రైతు కృపానందం మరణించారని అన్నారు. చనిపోయిన రైతు 4 రోజులపాటు ధర్నాల్లో పాల్గొన్నారని తెలిపారు. రాజధాని తరలిస్తే తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని లోకేశ్ అన్నారు. 10 మంది రైతులు చనిపోతే వైకాపా ఎమ్మెల్యేలు ఒక్కరూ స్పందించరా అని ప్రశ్నించారు. కృష్ణా - గుంటూరు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తేవాలన్నారు.
కావాలనే రైతులను రెచ్చగొట్టారు
హైపవర్ కమిటీలో అభివృద్ధిపై కనీస అవగాహన లేని వారున్నారని లోకేశ్ ఆరోపించారు. గతంలో ఓదార్పు యాత్ర చేసిన జగన్ ఇప్పుడెందుకు చేయలేకపోతున్నారని నిలదీశారు. ప్రజల్లోకి రావడానికి ముఖ్యమంత్రి, మంత్రులకు భయపట్టుకుందని ఎద్దేవా చేశారు. సీఎం బయటకు రావాలంటే రైతుల ఇళ్ల ముందు పోలీసులు వలలు పట్టుకుని నుంచుంటున్నారన్నారు. కనీసం జిల్లా మంత్రులకు కూడా రైతుల వేదన పట్టదా..? అని ప్రశ్నించారు. చనిపోయిన ఎస్సీ రైతు పెయిడ్ ఆర్టిస్టులా కనిపిస్తున్నారా అని ధ్వజమెత్తారు. నిరసన తెలిపేందుకు టెంట్ల నిరాకరణపై న్యాయపోరాటం చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. ఇప్పుడు అమరావతికి చేసిన అన్యాయమే జగన్ భవిష్యత్తులో విశాఖ, కర్నూలు ప్రజలకు కూడా చేస్తారని, ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలని కోరారు. చినకాకానిలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న రైతులను రెచ్చగొట్టడం వల్లే ఎమ్మెల్యే పిన్నెల్లి కారుపై దాడి జరిగిందని లోకేశ్ అన్నారు.
మూల్యం చెల్లించక తప్పదు
కృపానందం అంతిమయాత్రలో లోకేశ్, తెదేపా ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత, డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పాల్గొన్నారు. కృష్ణాయపాలెంలో ఇటీవల మరణించిన ప్రవీణ్ కుటుంబ సభ్యులను లోకేశ్, ఎంపీ గల్లా జయదేవ్ పరామర్శించారు. ఆవేదనతో చనిపోతున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అనడం దారుణమని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. రైతులను ఇలాగే కించపరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.
ఇదీ చదవండి: