రాజధానిలో జరిగిన భూ అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని... అసైన్డ్ భూముల రైతులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో అసైన్డ్ భూముల రైతులు ''తెదేపా కుంభకోణమే అసలు కోణం'' పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి సీపీఐ, భాజపా నేతలు, మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, జోగి రమేష్ పాల్గొన్నారు. తెదేపా... కొంతమంది అధికారులు, నేతలు తమను బెదిరించి భూములు లాక్కున్నారని రైతులు ఆరోపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినా... ఆయన చూపించిన రాజధానిని నిర్మించలేరని నేతలు చెప్పారు.
దళిత రైతులకు బెదిరింపులు
సమావేశంలో మాట్లాడిన మంత్రి బుగ్గన తెదేపాపై విమర్శలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు.. రాజధానిపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. సింగపూర్, మలేషియా, టోక్యో వంటి రాజధానిని నిర్మిస్తామంటూ... అమరావతి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. గ్రాఫిక్స్‌లో రాజధానిని చూపి రైతులను వంచనచేశారన్నారు. రాజధాని పేరిట దళిత రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని ధ్వజమెత్తారు.
రియల్ ఎస్టేట్ దందా
2014లో ఎవరూ ఊహించని పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిందని బుగ్గన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన తెదేపా... రాజధాని పేరిట రైతులను మోసం చేసేందుకు ప్రణాళిక వేసిందని ఆరోపించారు. ఇక్కడ భూములతో తెదేపా నేతలు రియల్ ఎస్టేట్ దందా చేశారన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేస్తారో ముందుగా తెలుసుకున్న తెదేపా నేతలు... ఇన్సైడ్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. సింగపూర్ ప్రభుత్వానికి అమరావతికి ఎటువంటి సంబంధంలేదన్నారు. సింగపూర్‌కు చెందిన రెండు ప్రైవేటు సంస్థలకు భూములను ప్లాట్లు వేసేందుకు మాత్రమే ఇచ్చారన్నారు. తెదేపా నేతలు తమ భూముల విలువ పెంచుకునేందుకే రాజధాని భ్రమకల్పించారన్నారు.
శివరామకృష్ణన్ నివేదికను పట్టించుకోలేదు
రాజధాని ఏర్పాటుకు... 2014లో శివరామకృష్ణన్ కమిటీ వేశారని మంత్రి బుగ్గన తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ అన్ని జిల్లాలను అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇస్తే... కనీసం ఆ రిపోర్టును పరిశీలించలేదన్నారు. అసెంబ్లీలో చర్చ కూడా పెట్టలేదన్నారు. అమాయక దళిత రైతులను భయపెట్టి బలవంతంగా భూములు లాక్కున్నారని ఆరోపించారు. రైతులకు మహా రాజధాని వస్తుందని ఆశ చూపి... మోసం చేశారన్నారు. ప్రభుత్వ మార్పిడి సమయంలో ఖజానాకు రూ.40 వేల కోట్ల బకాయిలు పెట్టారన్నారు. వైకాపా అభివృద్ధికి అనుగుణంగా పనులు చేస్తుందని ఉద్ఘాటించారు. ప్రతికూల పరిస్థితుల్లో పాలన చేస్తూ... పేదల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి :