చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వరద నిర్వహణ చేతకాదని తెదేపా నేతలు లేనిపోని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాజధాని రైతులకు కౌలు, పింఛను ఇవ్వాలని తమకు తెలుసని మంత్రి బొత్స పేర్కొన్నారు. అవినీతిని పూర్తిగా అరికడతాం.. కాస్త ఓపిక పట్టాలన్నారు. మెట్రో ప్రాజెక్టులపై అన్నిరకాలుగా సమీక్ష చేస్తున్నామన్న బొత్స... త్వరలో అన్ని వివరాలు బయటపెడతామని చెప్పారు.
తలసరి ఆదాయం, జీడీపీ పెరిగితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజధానిలో తప్ప మరెక్కడా భూముల రేటు పెరగకూడదా..? అని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు విధానం ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎం.ఎస్.పి.రామారావు పేరుతో భూములు అప్పగించారన్న బొత్స... ల్యాండ్ పూలింగ్ కింద కొందరి పేర్లపై 25 వేల చదరపు గజాలు ఉన్నాయని వెల్లడించారు. అందరి వ్యక్తుల జాబితా తమ వద్ద ఉందన్న మంత్రి... రాజధాని కోసం కేంద్రం రూ.1,500 కోట్లు ఇచ్చిందని వివరించారు.
శాసనసభ్యులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్ తప్ప అన్నీ తాత్కాలిక భవనాలేనని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. టెండర్లు పిలిచినప్పుడు చంద్రబాబు విధానాలు పాటించలేదని పేర్కొన్నారు. టెక్నాలజీ తెచ్చానని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముంపు వస్తుందని కాల్వల నిర్మాణం, లిఫ్ట్ పెట్టడం టెక్నాలజీయా..? అని ప్రశ్నించారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ఎందుకు సమగ్రంగా పరిశీలించలేదని నిలదీశారు. ఆదరాబాదరాగా నారాయణ కమిటీని ఎందుకు వేశారన్న బొత్స... అప్పుడు వ్యతిరేకించిన పార్టీతోనే చంద్రబాబు ఇప్పుడు స్నేహం చేస్తున్నారని విమర్శించారు.
వైకాపా ప్రభుత్వం ఎప్పుడూ రైతు పక్షపాతిగా ఉంటుందని... అభివృద్ధి నిరంతరం కొనసాగుతోంది.. అదెప్పుడూ ఆగదని పేర్కొన్నారు. 2009లో వచ్చినట్లు వరద వస్తే పరిస్థితి ఏమిటి? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. చొక్కాలు మార్చినట్లు పార్టీలు మారినవాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సీనియర్ నేతలు మరింత బాధ్యతగా మాట్లాడాలని హితవు పలికారు. రాజధాని ప్రాంతంలో సుజనా తనకు అంగుళం భూమి లేదన్నారన్న బొత్స... సుజనాకు ఉన్న మొత్తం భూముల జాబితా తమ వద్ద ఉందని తెలిపారు. సుజనాకు మొత్తం 120 కంపెనీలు ఉన్నాయన్న బొత్స... సుజనా కంపెనీకి చందర్లపాడు మండలం గుడిమెట్లలో 110 ఎకరాలు ఉన్నాయని వెల్లడించారు.
యలమంచిలి రుషికన్య పేరుతోనూ భూములు ఉన్నాయని... రాజధానిలో ఎవరికెన్ని భూములు ఉన్నాయో మొత్తం బయటపెడతామని పేర్కొన్నారు. జగ్గయ్యపేటలో 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చి తర్వాత రాజధానిలో కలిపారని మంత్రి బొత్స తెలిపారు. ఇంట్లోవాళ్లకు ఎకరం రూ.వెయ్యి చొప్పున ఇచ్చుకోవడం గతంలో ఉందా? అని ప్రశ్నించారు. రాజధాని అనేది ఒక ప్రాంతానిదో, సామాజికవర్గానిదో, నేతలదో కాదన్న బొత్స... రాజధాని అనేది 5 కోట్ల మంది ప్రజలదని స్పష్టం చేశారు.
వరద సమయంలో ప్రాజెక్టులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో అంశాలను అధికారులు నిత్యం సమీక్షించారని వివరించారు. వరద ప్రాంతాల్లో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్న బొత్స... వరదలు పూర్తయ్యాక చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చారని విమర్శించారు. రైతులకు చిన్న ఇబ్బంది వచ్చినా వైకాపా ప్రభుత్వం సహించదని ఉద్ఘాటించారు. మరో అరగంటపాటు గేట్లు ఎత్తకుంటే చంద్రబాబు ఇల్లు మునిగిపోయేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండీ...'అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ'