రాజధానిలో గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ కొనసాగుతోందని.. త్వరలోనే వివరాలు బయట పెడతామనీ.. అమరావతి పట్టణమా, గ్రామమా అన్నది త్వరలోనే నోటిఫై చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాజధానిలో భూసేకరణపై సీఎం జగన్ సమీక్ష జరిపారని, భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించామని చెప్పారు. ఈనెల 28న అమరావతిలో చంద్రబాబు పర్యటనపై మంత్రి పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అమరావతి వచ్చి ఏం చూస్తారని.. నాలుగు భవనాలను 56 శాతం నుంచి 90 శాతం వరకు కట్టారని, అంతకు మించి అక్కడ ఏముందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో 4900 కోట్ల ఖర్చు చేశారు కానీ రాజధానిలో ఏమీ లేదని విమర్శించారు. పనులు ఐదు శాతం పూర్తి అయ్యి 95 శాతం మిగిలి ఉంటే.. దాన్ని రాజధాని కట్టేయడం అంటారా అని ఎద్దేవా చేశారు. 28వ తేదీన చంద్రబాబు వస్తే రైతులు నిలదీయాలని పిలుపునిచ్చారు.
తెదేపా మాయలో పడొద్దు..
రాజధానిలో భూసేకరణపై సీఎం జగన్ సమీక్ష జరిపారని.. ఈ సమావేశంలో భూములు ఇచ్చిన రైతుల సమస్యలపై చర్చించామని మంత్రి బొత్స తెలిపారు. రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లను తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. తెదేపా మాయలో పడొద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు.
పవన్ కల్యాణ్ మెచ్చుకుంటారో లేదో చూడాలి...?
ఇసుకపై చంద్రబాబు ఎంత గొడవ చేసినా.. మేం కంగారు పడి పాలనను గాడి తప్పించలేదన్నారు. అవినీతికి వ్యతిరేకంగా 14400 కాల్సెంటర్ పెట్టామని.. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇలా మొదలుపెట్టిందా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ దీన్ని మెచ్చుకుంటారో.. లేక తెదేపాకు కోరస్లా మాట్లాడతారో చూడాలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మేం మాతృభాషకు వ్యతిరేకం కాదు...
కొత్త ప్రభుత్వం కొన్ని నిర్ణయాలకు కొంత సమయం తీసుకుంటుందని మంత్రి బొత్స అన్నారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలు తెస్తున్నామని తెలిపారు. 1 నుంచి 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం అని చెప్పామని.. అలాగే తెలుగునూ తప్పనిసరి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మాతృభాష గురించి చెప్పారనీ.. తాము మాతృభాషకు వ్యతిరేకం కాదన్నారు. ఇప్పటికీ కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజల స్పందన చూశాక చాలా మంది ఇప్పుడు యు-టర్న్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : విగతజీవిగా దీప్తిశ్రీ.. ఇంద్రపాలెంలో మృతదేహం లభ్యం