ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నిర్ణయాల వల్లే రైతులు బలైపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రాజధాని కోసం భూమి ఇచ్చిన రైతు మల్లిఖార్జున రావు... జగన్ నిర్ణయాలతో ఆందోళన చెంది మరణించిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. రైతులను పొట్టన పెట్టుకుంటున్న వైకాపా ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు. నేతి బీరకాయలో నెయ్యి చందంగా ఉంది... జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన అని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్ప అభివృద్ధి ప్రణాళిక ఎక్కడ ఉందని నిలదీశారు. విశాఖలో 70 వేల ఉద్యోగాలు వచ్చే అదాని డేటా సెంటర్‌ని, లులూ మాల్ని తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకి రావడానికి సిద్ధపడిన పేపర్ ఇండస్ట్రీ పారిపోయిందని మండిపడ్డారు. తిరుపతికి వస్తామన్న జియో ఫోన్ల తయారీ కంపెనీ రిలయన్స్... జగన్ నిర్ణయాల వల్ల వణికిపోయిందని విమర్శించారు. వైకాపా నాయకులు అన్నట్టు గానే మూడు కాదు ముప్పై రాజధానులు పెట్టినా... ప్రతి వారం కోర్టు ముందు నిలబడే వ్యక్తిని చూసి అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ముందుకు ఎవరు వస్తారని లోకేశ్ ప్రశ్నించారు.
ఇదీ చూడండి: 'బోస్టన్... అది నివేదికలా లేదు'