తెలుగు దినపత్రిక సాక్షిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పరువునష్టం దావా వేశారు. విశాఖపట్నం 12వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో రూ.75 కోట్లకు పరువునష్టం దావా దాఖలు చేశారు. ఒరిజినల్ సూట్ 6/2020 నంబరుతో దాఖలైన వ్యాజ్యంలో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే దురుద్దేశంతో సాక్షి పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారని దావాలో పేర్కొన్నారు. సాక్షి దినపత్రికలో 2019 అక్టోబర్ 22న "చినబాబు చిరుతిండి 25 లక్షలండి" శీర్షికతో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనంలో ప్రచురితమైన అంశాలన్నీ పూర్తిగా అవాస్తవాలని, దురుద్దేశపూర్వకంగా తప్పుడు కథనం రాశారని 2019 అక్టోబర్ 25న సాక్షి సంపాదక బృందానికి లోకేశ్ న్యాయవాదులు రిజిస్టర్ నోటీసు పంపించారు. దీనికి సంబంధించి 2019 నవంబర్ 10న సాక్షి వివరణ ఇచ్చింది. ఈ వివరణపై సంతృప్తి చెందని లోకేశ్ సదరు పత్రికపై పరువు నష్టం దావా వేశారు.
![lokesh files defamation suit on sakshi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5834289_lokesh.jpg)
అసత్య కథనంతో తీవ్ర మనోవేదనకు గురయ్యా: లోకేశ్
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చిరుతిళ్లు తిన్నానని సాక్షి రాసిన తేదీలలో తాను ఇతర ప్రాంతాలలో ఉన్నానని అయినప్పటికీ తన పరువుకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ధి పొందేందుకు అసత్యాలతో కథనం వేశారని దావాలో పేర్కొన్నారు. ఉన్నత విద్యావంతుడిగా, ఒక జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పని చేసిన తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేందుకు తనకు సంబంధంలేని అంశాలతో ముడిపెట్టి అసత్య కథనం రాసి ప్రచురించిన కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యానని దావాలో పేర్కొన్నారు. ఈ తప్పుడు కథనానికి బాధ్యులైన సాక్షి సంస్థ జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్, సాక్షి ప్రచురణకర్త, సంపాదకుడైన మురళి, విశాఖకు చెందిన సాక్షి న్యూస్ రిపోర్టర్లు బి.వెంకటరెడ్డి, గరికపాటి ఉమాకాంత్‌పై రూ.75 కోట్లకు పరువు నష్టం దావా దాఖలు చేశారు లోకేశ్.
ఇదీ చదవండి : ఉద్యమాన్ని అణచివేసేందుకు మీడియాపై తప్పుడు కేసులు: లోకేశ్