పెళ్లి... ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైనదే. గాజులూ నగలూ పూలదండలూ పూలబొకేలూ... ఇలా పెళ్లికి ధరించినవీ వాడినవీ ఎప్పటికీ గుర్తుండేలా దాచిపెడుతుంటారు కొందరు. ఇప్పుడు వాటినో... అందమైన ఫొటో ఫ్రేములో బంధించి మరీ గోడకి అలంకరించేస్తున్నారు.
తరువాతి తరాలకు తీపి గుర్తులుగా
పెళ్లిలో ధరించే పూలమాలలు కొన్నాళ్లకే వాడిపోతాయి. అదే కర్పూరం కలగలిసిన చమ్కీ దండలయితే ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఆ కారణంతోనే ఒకప్పుడు పెళ్లిలో పూలమాలలతోబాటు వాటిని కూడా వేసేవారు. ఆ తరవాత తమ పెళ్లి గుర్తుగా జాగ్రత్తగా దాచిపెట్టుకునేవారు. అలాగే చాలామంది తమ పెళ్లి కార్డునీ బీరువాల్లో భద్రపరుస్తారు. మరికొందరు పెళ్లినాటి దుస్తుల్నీ, నగల్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టి తరువాతి తరాలకి అందిస్తుంటారు.
సరికొత్తగా...వినూత్నంగా
అయితే ఇప్పుడు పెళ్లంటేనే మూడు వీడియోలూ ఆరు ఫొటో ఆల్బమ్‌లూ అన్న రీతిలో వెడ్డింగ్ ఫొటోగ్రఫీ పెరిగిపోయింది. ఒకప్పుడు పదో పాతిక ఫొటోలతో తయారయ్యే ఆల్బమ్ కాస్తా నేడు వేల ఫొటోలకి చేరి, పెళ్లి తంతులోని విభాగాల వారీగా తయారవుతోంది. అయినా ఏదో అసంతృప్తి. పెళ్లి ఫొటో ఫ్రేములో ఎక్కడో వెలితి. అందుకే పెళ్లి శుభలేఖనీ అలంకారాల్నీ పూలబొకేలతో కలగలిసిన ఫొటో ఫ్రేములకి శ్రీకారం చుట్టారు ఔత్సాహిక ఫొటో డిజైనర్లు. దాని ఫలితమే ఈ సరికొత్త పెళ్లి ఫొటో ఫ్రేములు.
అక్కడ మెుదలైందీ ట్రెండ్...
నిజానికి పాశ్చాత్యదేశాల్లో మొదలైందీ ట్రెండ్. పెళ్లి బొకేల్లోని పూలు వాడిపోకుండా షాడో బాక్సుల్లో పెట్టి నిల్వచేయగలిగే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అక్కడ పెళ్లికి పట్టుకునే పూలబొకేలకి పెళ్లి ఫొటోనీ, పెళ్లి కార్డునీ జోడించి ఫొటో ఫ్రేమ్ డిజైన్ చేయడం ప్రారంభించారు. మనవాళ్లు మరో అడుగు ముందుకేసి శుభలేఖనీ, పెళ్లి ఫొటోనీ, పెళ్లి గాజుల్నీ, నగల్నీ కూడా కలగలిపి వెడల్పాటి ఫ్రేములో భద్రపరుస్తున్నారు. ముందుముందు ఇది మరింత విస్తృతమై మీనియేచర్ పెళ్లి దుస్తుల్ని సైతం ఫ్రేముల్లో అతికిస్తే ఆశ్చర్యం లేదు. మొత్తమ్మీద ఐడియా అదిరింది కదూ..!
ఇదీచదవండి