ఉభయగోదావరి జిల్లాల్లో సంక్రాంతి నాడు కోడిపందేలను జోరుగా నిర్వహించారు. పండక్కి సొంతూరు వచ్చే వారంతా... పోటీలకు హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా వందల బరులు ఏర్పాటు చేసి కోడిపందేల నిర్వహించారు. బరులన్నీ జనాలతో కిటకిటలాడాయి. దెందులూరులో కోడి పందేలుతో పాటు పేకాట జోరుగా సాగింది. శ్రీరామవరం, కొండలరావుపాలెం, పాతపెదపాడులో భారీఎత్తున పందేలు నిర్వహించారు.వీటిని తిలకించేందుకు తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలసంఖ్యలో తరలివచ్చారు.
పందెంరాయుళ్లకు కాసులపంట
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కోడిపందేలు, గుండాట జోరుగా సాగింది. డీఎస్ పాలెం, ఉడిమూడి, పోతవరం, నాగుల్లంక, మానేపల్లి, వాడ్రేవుపల్లి, జి.అగ్రహారం, చింతలంకలో అడ్డూ-అదుపూ లేకుండా పందేలు నిర్వహించారు. బరిలో కోడిపుంజులు... వీరోచితంగా పోరాడుతూ.. పందెంరాయుళ్లకు కాసులు కురిపించాయి. గుండాటలోనూ స్థానికులు అదే రీతిలో పాల్గొన్నారు.
జగ్గయ్యపేట ప్రాంతంలో కోడిపందాలు జోరుగా సాగాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో తెలంగాణా నుండి కూడా పందెం రాయుళ్లు తరలివచ్చారు. చిల్లకలు, షేర్ మహ్మద్ పేట, అనుమంచి పల్లి గ్రామాలతో పాటు జగ్గయ్యపేట శివార్లు, వేదాద్రి, బూదవాడ గ్రామాల్లో బరులు ఏర్పాటు చేశారు. కోడి పందాలతో పాటు పెద్ద మొత్తంలో జాద క్రీడలు కూడా సాగాయి. బారుల వద్దకు తరలివచ్చిన పందెం రాయుళ్ల వాహనాలతో ప్రాంగణాలు కోలాహలంగా మారాయి.
ఇదీ చదవండి : 'పేదలను పండగ పూట పస్తులు ఉంచడమే నవశకమా?'