తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజనపై జస్టిస్ ధర్మాధికారి కమిటీ విచారణ ముగిసింది. ఆదివారం రెండోరోజు హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన విచారణ జరిపారు. ఏపీ దక్షిణ డిస్కం సీఎండీ, జీఎండీ, తెలంగాణ జెన్‌కో సంచాలకుడు సహా ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ స్థానికత గల 1157 మందిని 2015లో తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ చేశారు. వీరిని చేర్చుకునేందుకు ఏపీ విద్యుత్ సంస్థలు నిరాకరించటంతో ఈ వివాదాన్ని తేల్చడానికి ధర్మాధికారితో ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. వీరిలో 613 మంది ఏపీలోనే చేరతామని ఆప్షన్ ఇచ్చినందన... వారిని అక్కడ చేర్చుకుంటే మిగిలిన వారిని తెలంగాణలో తిరిగి చేర్చుకోవడానికి ఇబ్బంది లేదని తెలంగాణ రాష్ట్ర సంస్థలు ఆదివారం రాతపూర్వకంగా తెలిపాయి. ఈ 1157 మంది కాకుండా ఏపీలో ప్రస్తుతం పని చేస్తున్న వారిలో 256 మంది తెలంగాణకు వెళతామని ఆప్షన్ ఇచ్చినందున వారిలో సగం మందిని కూడా తీసుకుంటామని పేర్కొన్నాయి. కానీ 613 మందిని ఏపీలోకి చేర్చుకుంటేనే మిగతా వారిని తీసుకుంటామని షరతు పెట్టాయి. ఈ ప్రతిపాదనలన్నింటిని ఏపీ తిరస్కరించింది. ఇక ఈ అంశంపై విచారణ ముగిసిందని... తుది నివేదికను సుప్రీంకోర్టుకు ఇస్తామని జస్టిస్ ధర్మాధికారి ప్రకటించారు. ఆయన ఇచ్చే తుది నివేదికలోని సిఫార్సులే సుప్రీంకోర్టు ఆదేశాలుగా త్వరలో వెలువడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి