వ్యక్తిగత, అధికారిక పనుల నిమిత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా వెళ్లనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లి... శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికా పర్యటనకు కుటుంబ సమేతంగా వెళ్తారు. అమెరికాలోని ఇండియానాలో ఉన్న నోట్రేడేమ్ విశ్వవిద్యాలయంలో ఆయన చిన్న కుమార్తె అడ్మిషన్ కోసం జగన్ వెళ్తున్నారు. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లనున్న ముఖ్యమంత్రి... ఈనెల 24న విజయవాడ చేరుకోనున్నారు.
9రోజుల పాటు జగన్ పర్యటన వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసింది. 16నుంచి 22 తేదీల మధ్య అమెరికాలోని వాషింగ్టన్ డీసీ, డల్లాస్, షికాగోలో అమెరికా ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రి జగన్తో భేటీ కానున్నారు. వాషింగ్టన్ డీసీలో ప్రపంచబ్యాంకు ప్రతినిధులతోనూ సీఎం జగన్ సమావేశం కానున్నారు.
ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు సంబంధించి అన్ని అనుమతులూ మంజూరు చేస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్తో పాటు ఆయన భద్రతా అధికారులు... సీఎంఓలోని పలువురు అధికారులూ అమెరికా వెళ్లనున్నారు. ముందుగా వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా పర్యటనకు వెళ్తుండటంతో... విమాన టిక్కెట్లు, వసతికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం నుంచి కాకుండా వ్యక్తిగతంగానే భరిస్తున్నట్టు సీఎంఓ కార్యాలయం స్పష్టం చేసింది.
ఇదీ చదవండీ...