రాష్ట్రంలో నాలుగు నెలల్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే.కె. మహేశ్వరి, జస్టిస్ విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ ఏపీ పౌరహక్కుల అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి మోహనరావు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ గత నాలుగేళ్లుగా కమిషన్ పనిచేయడం లేదని తెలిపారు. ఇద్దరు సభ్యుల పదవీ కాల పరిమితి 2015 ఆగస్టుతో ముగిసిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఛైర్‌పర్సన్ జస్టిస్ ఎన్.ఏ.కక్రూ 2016 డిసెంబర్లో పదవీ విరమణ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. మూడు నెలల్లో కమిషన్ను తిరిగి ఏర్పాటు చేస్తామని సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. అందుకు తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కమిషన్ ఏర్పాటుకు నాలుగు నెలల గడువిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి: