రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. మార్చి 3లోపు ప్ర క్రియంతా పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రమాణపత్రం దాఖలు చేసిన నేపథ్యంలో... ఎన్నికల నిర్వహణకు న్యాయస్థానం ఆమోదం తెలిపింది. జనవరి 10న సీఎస్, డీజీపీ, ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శులతో పాటు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ప్రమాణపత్రంలో ఈసీ వెల్లడించింది. జనవరి 13న రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 15 మధ్య ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని వెల్లడించింది. ఫిబ్రవరి 8 నుంచి మార్చి 3 మధ్య గ్రామ పంచాయతీ ఎన్నికలూ పూర్తవుతాయని స్పష్టం చేసింది. మరో వైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 59.85 శాతం ఉండటం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమంటూ...హైకోర్టులో కర్నూలు వాసి పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెంబర్ 176 అమలును నిలుపుదల చేయాలంటూ న్యాయస్థానానికి విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం జీవోపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి:'విశాఖనే రాజధానిగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే..!'