ఉదయం ధర్నాలు, నిరసన దీక్షల హోరు... సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శనలు, ర్యాలీలు.... ఇలా అలుపెరగని పోరాటాన్ని.... అమరావతి అన్నదాతలు 32రోజులుగా కొనసాగిస్తున్నారు. 33వరోజైన ఇవాళ కూడా మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు నిర్వహించనుండగా.... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయిని పాలెంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పూజలు చేయనున్నారు.
రేపటి మంత్రివర్గ సమావేశం, అసెంబ్లీ నిర్వహణ దృష్ట్యా పోలీసు ఆంక్షలు మళ్లీ పెరుగుతున్నాయి. రాజధాని అమరావతి గ్రామాల్లో భారీ ఎత్తున పోలీసులు మోహరించనున్నారు. ముందస్తు బందోబస్తులో భాగంగా కొంతమందికి నోటీసులు జారీ చేశారు. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే తమ నిరసనలు కొనసాగించనున్నారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు ఇతర గ్రామాలతో పాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.
ఇదీ చదవండి : 20న శాసనసభ ముట్టడి: చంద్రబాబు