రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ... తెదేపా నేత దేవినేని ఉమా గొల్లపూడి సెంటర్లో 24 గంటల నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... అమరావతిని ప్రజారాజధానిగా సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజధానిపై మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిపై కమిటీల పేరుతో కుట్రకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ఏమీ తెలియని వాళ్లతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారని ఆరోపించారు. వైకాపాకు చెందిన కొందరూ నేతలు... వాళ్ల సన్నిహితుల ద్వారా విశాఖ, భీమిలి ప్రాంతాల్లో భారీగా భూములు కోనుగోలు చేశారని ధ్వజమెత్తారు.
ఇష్టానుసారంగా మాట్లాడుతారా..?
రాజధాని కోసం రైతులు 36 వేల ఎకరాల భూమలు ఇస్తే.. వాళ్ల త్యాగాలను అపహాస్యం చేసేలా మంత్రులు మాట్లాడుతున్నారని దేవినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిలో కేవలం ఐదు వేల కోట్ల పనులే జరిగాయని చెప్పడం అసత్యమని వ్యాఖ్యానించారు. అమరావతి కోసం సంఘటితంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని రైతులకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి : సైన్యాధిపతిగా సెలవు.. సీడీఎస్‌గా రేపు రావత్ బాధ్యతలు