రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సాధారణ బీమా సంస్థకు విధివిధానాలు విడుదలయ్యాయి. ఇక నుంచి పంటల బీమా, పరిహారం చెల్లింపు అంశాలను ఈ సంస్థే చూస్తుంది. పంటల బీమాకు సంబంధించి రైతులు ఏ ఏజెన్సీకి ప్రీమియం చెల్లించాల్సిన పనిలేదు. పంట నష్టపోయినప్పుడు సంబంధిత రైతుల బ్యాంకు (ఆధార్ అనుసంధానిత) ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం జమ చేస్తుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య ఆదివారం ఉత్తర్వులిచ్చారు. మొత్తం సాగు విస్తీర్ణంలో మూడింట ఒక వంతు బీమాకు నోచుకోని నేపథ్యంలో.. ప్రధానమంత్రి ఫసల్‌బీమా, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల కింద ఎక్కువ మంది రైతులకు ప్రయోజనాలు అందించేందుకు సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మార్గదర్శకాలు
* గ్రామసచివాలయాల్లోని వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది ఉమ్మడిగా పరిశీలించి సాగుదారుల వివరాలను గడువులోగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. పంట నష్టం, పరిహారం చెల్లింపు అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సవరించిన వాతావరణ ఆధారిత బీమా పథకాల కింద ఇప్పటికే ఉన్న నియమ నిబంధనలను వర్తింపజేస్తారు.
* పంటల బీమా అమలు, పర్యవేక్షణ, పంటకోత ప్రయోగాలు, పరిహారం అందజేత తదితర అంశాలపై వ్యవసాయశాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రెవెన్యూ, ప్రణాళిక శాఖలు తమ బాధ్యతలను నిర్వహించాలి.
* పంట నష్టపోయినప్పుడు అర్హులైన రైతులకు సాధ్యమైనంత త్వరగా న్యాయ పరిహారం అందేలా వ్యవసాయ కమిషనర్ చర్యలు తీసుకోవాలి.
ప్రత్యేకంగా ఎందుకంటే..
ఈ ఏడాది నుంచి రాష్ట్రంలో ఉచిత పంటల బీమాను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల తరఫున వారి ప్రీమియం వాటాతో పాటు ప్రభుత్వ వాటాను కూడా రాష్ట్రమే బీమా సంస్థలకు చెల్లిస్తోంది. దీనికంటే సొంతంగా బీమా సంస్థ ఏర్పాటుచేస్తే పరిహారం చెల్లింపులో జాప్యం నివారించవచ్చని భావించిన ప్రభుత్వం.. రూ.101 కోట్లతో ఆంధ్రప్రదేశ్ సాధారణ బీమా సంస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ప్రస్తుత రబీ నుంచే అమల్లోకి తెస్తున్నట్లు పేర్కొంది.
ఇవీ చదవండి..