సీఎం జగన్ ఆదేశాలు నిర్ణీత వ్యవధిలో అమలు కాకపోవటంపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. సీఎం ఆదేశాలు సమయానుగుణంగా అమలుకాక పథకాల అమల్లో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అధికారులు అంటున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యంతో పథకాల తీవ్రత తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బిజినెస్ రూల్స్- 2018లో సవరణలు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
కార్యదర్శుల నుంచి ముఖ్యమంత్రికి ఈ-ఆఫీస్ ద్వారా పంపే దస్త్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ప్రతిశాఖ నుంచి వచ్చే దస్త్రాలకు ఆర్థిక, న్యాయశాఖ క్లియరెన్స్ తీసుకునేందుకు గడువు ఇచ్చారు. ఆయా దస్త్రాలను ఆర్థిక, న్యాయశాఖలు రెండ్రోజుల్లో క్లియర్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. మిగతా శాఖలు ఒక రోజులో క్లియర్ చేసేలా ఆదేశాలిచ్చారు. నిర్ణీత సమయంలోగా పూర్తికాకుంటే వాటంతట అవే క్లియర్ అయినట్లు గుర్తించనున్నారు. సీఎం ఆమోదం తర్వాత 15 రోజుల్లోగా జీవో విడుదల కావాలని ఆదేశాలిచ్చారు. మీడియా అంశాల్లో ముఖ్యమంత్రికి తెలియకుండా జీవోలు ఇవ్వరాదని ఆదేశాలిచ్చారు.
ఇదీ చదవండి