జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ సహా, ఆ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలవరం సహా ప్రస్తుతం నడుస్తున్న సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం సమీక్షించారు. అనుకున్న సమయానికి పోలవరం పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. రాయలసీమలో కరవు నివారణ కోసం చేపట్టాల్సిన కార్యాచరణను అధికారులు సీఎంకు వివరించారు. కాల్వల విస్తరణ, ఆర్ అండ్ ఆర్ వంటి ప్రతిపాదనలను తెలియజేశారు.
సీఎం.. ఓ ప్రతిపాదన
గోదావరి –కృష్ణా అనుసంధాన ప్రతిపాదనలను సీఎం ముందుంచారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానంపై తయారుచేసిన ప్రతిపాదనల్లో మార్పులు, చేర్పులపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. వ్యయం తగ్గింపు సహా ప్రాజెక్టు శరవేగంగా పూర్తయ్యే మార్గాలపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు నదుల అనుసంధానానికి సంబంధించి, సీఎం స్వయంగా ఓ ప్రతిపాదన చేశారు.
సాగర్‌కు రివర్స్ పంంపింగ్
గోదావరి నీటిని పోలవరం నుంచి తొలుత పులిచింతలకు.... అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు రివర్స్ పంపింగ్ చేసే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన సాంకేతికాంశాలు, ఇబ్బందులను అధ్యయనం చేసి, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. గోదావరి నీటిని బొల్లాపల్లి జలాశయం మీదుగా బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయంగా దీనిని పరిశీలించాలన్నారు. అలాగే తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో నీటి తరలింపునకు ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
రూ.25 వేల కోట్లు అంచనా
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపైనా సీఎం సమీక్షించారు. పోలవరం, వెలిగొండ, చిత్రావతి, గండికోట ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ అండ్ ఆర్‌పై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టాలని ఆదేశించారు. పోలవరం మినహా ప్రస్తుతం కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు 25 వేల 698 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. రాయలసీమలో కరవు నివారణ పనులకోసం 33 వేల 869 కోట్లు ఖర్చు అవుతుందని..... ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి 15 వేల 488 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలుగట్టారు. దీనిపై తుది ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులకు సీఎం సూచించారు. పోలవరం నుంచి విశాఖపట్నానికి నీటి తరలింపునకు ప్రత్యేక పైపు లైన్‌పై కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: