ఏపీపీఎస్సీ ఉద్యోగాల భర్తీ క్యాలెండర్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొడాలి నాని, సీఎస్, డీజీపీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వైద్య, విద్యా రంగాల్లో సమూల మార్పులను ఆశిస్తున్నామన్న సీఎం... వైద్య, విద్యా రంగాల్లో ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆదేశించారు. అవసరం మేరకు విద్య, వైద్య విభాగాల్లో సిబ్బందిని ఉంచాలన్నారు. పోలీసు విభాగంలో వారాంతపు సెలవులను సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టు పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.
పాఠశాలల్లో సిబ్బంది లేకపోతే డబ్బు ఖర్చు పెట్టినా వృథా అవుతుందన్న సీఎం.. ఉపాధ్యాయులు సరిపడా లేకపోతే పాఠశాలల సమర్థత తగ్గుతుందని సీఎం అన్నారు. పాఠశాలల్లో ల్యాబ్ టెక్నీషియన్లు కూడా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. వారాంతపు సెలవుల వల్ల పోలీసు శాఖ సామర్థ్యం తగ్గకూడదన్న ముఖ్యమంత్రి.. ప్రాధాన్యతలు నిర్ధరించుకుని పోస్టుల భర్తీపై కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ విభాగంలోనూ ప్రాధాన్య పోస్టుల భర్తీపై దృష్టి పెట్టాలన్నారు. ప్రతి విభాగంలో ప్రాధాన్యతా క్రమంలో పోస్టుల భర్తీపై చర్చించాలన్నారు సీఎం. మూడు వారాల్లో ప్రాధాన్యతా పోస్టులను నిర్ధరిస్తామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 21న సీఎంతో అధికారులు మరోసారి భేటీ అయ్యి కార్యాచరణ తెలియజేయనున్నారు.