రైతులకు లభిస్తున్న ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎలా వస్తుందని అధికారులను సీఎం జగన్ ప్రశ్నించారు. మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌పై సమర్థవంతమైన వ్యవస్థ ఉండాలని ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ మిషన్‌పై జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ఎలా నడుస్తుందో పరిశీలించాలని... ప్రత్యామ్నాయ విధానాన్ని అవలంబించాలని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
మినుములు, పెసలు, శనగలు, టమాటాలకు సరైన ధరలు రావడంలేదని... అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం... రైతుల వద్ద నిల్వలు ఉన్నాయని, దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడమూ ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలని సీఎంకు వివరించారు. మద్ధతు ధర లేక, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేయక... గత ప్రభుత్వం హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం ఆక్షేపించారు. గతంలో వ్యాపారులు, రాజకీయ నాయకులు రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారని సమావేశంలో ప్రస్తావించారు.
ప్రస్తుతం పంట చేతికి వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు సిద్ధం కావాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు, శనగల తదితర పంటల కొనుగోలు కోసం కేంద్రాలు తెరవాలని సీఎం సూచించారు. గ్రామ సచివాలయాల ద్వారా పలానా పంటలు వేశామంటూ రైతులు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని ముఖ్యమంత్రి సూచించారు. రబీ నుంచి ఈ విధానం అమలుకు ప్రయత్నాలు చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ధరల స్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకుంటూ... రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో వర్షపాతం వివరాలు, వివిధ జిల్లాలో పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికలు ఆలోచించాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.1830 కోట్లను ఈ నెలాఖరులో రైతులకు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల రైతు భరోసా, ఈ ఇన్‌పుట్ సబ్సిడీలు రైతులకు అండగా ఉంటాయని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. వర్షపాతం లోటు ఉన్న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం సూచించారు.
పశువుల కోసం వినియోగిస్తున్న ఔషధాల్లో ప్రమాణాలు, నాణ్యత ఉండడం లేదని... ప్రపంచ స్థాయి ప్రమాణాలు, నాణ్యత ఉండేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఎండిపోతున్న మామిడి, చీనీ తదితర పంటలను కాపాడేందుకు నీటి సరఫరా కోసం పెండింగ్‌లో ఉన్న నిధులు వెంటనే విడుదల చేయాలని జగన్ సూచించారు. వాతావరణ మార్పులు రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై చూపిస్తున్న ప్రభావాన్ని అంచనా వేయాలని... సగటు వర్షపాతం ఉన్నా కరువు ఎందుకు వస్తుందన్న పరిస్థితులపై అధ్యయనం చేయాలని వ్యవసాయ మిషన్ సభ్యుడు పి. సాయినాథ్ సమావేశంలో ప్రస్తావించారు.
ఇదీ చదవండీ... ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రం పోవాలా..?