15వ ఆర్థిక సంఘం బృందంతో సమావేశమైన సీఎం జగన్... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించి తగు సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విభజనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నివేదికలో పేర్కొన్నారు. విభజన చట్టం హామీల మేరకు రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని కోరారు. రాష్ట్ర పరిస్థితులపై సమగ్ర వివరణతో ఉన్నతాధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు.
15వ ఆర్థిక సంఘం వద్ద జగన్ ప్రస్తావించిన అంశాలు
విభజన వల్ల రాష్ట్రం రాజధానిని కోల్పోయిందని జగన్ 15వ ఆర్థిక సంఘానికి తెలిపారు. ఇచ్చిన హామీల అమలును పెండింగ్‌లో పెడుతున్నారన్నారు. విభజన హామీల అమలుకు కేంద్రంలో యంత్రాంగం ఉండేలా చూడాలని కోరారు. సమగ్రాభివృద్ధికి రాష్ట్రంలో వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వారికి వివరించారు. అమలు చేస్తున్న కార్యక్రమాలకు సహాయం అందేలా చేయాలని ఆర్థిక సంఘాన్ని సీఎం కోరారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందిగా ఆర్థిక సంఘం సిఫార్సు చేయాలన్నారు.
పోలవరం ప్రాజెక్టు పనుల వివరాలను ఆర్థిక సంఘం తెలుసుకుంది. ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు ఖర్చు చేశామని అధికారులు తెలిపారు. పోలవరానికి వెంటనే నిధులు విడుదల చేయాల్సిందిగా సిఫార్సు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. విభజన చట్టం ప్రకారం దుగరాజపట్నంలో పోర్టు నిర్మించాల్సి ఉందని ఆర్థిక సంఘానికి జగన్ గుర్తు చేశారు. 2018 కల్లా ఫేజ్-1 పూర్తిచేస్తామని చట్టంలో పేర్కొన్నారు. దుగరాజుపట్నం పోర్టుకు రావాల్సిన నిధులు ఇవ్వాలని అడిగిన సీఎం.. రామాయపట్నం వద్ద పోర్టు నిర్మాణానికి యత్నిస్తున్నట్లు వివరించారు. పోర్టు నిర్మాణానికి తగిన సహాయానికి సిఫార్సు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఆర్థిక సంఘం దృష్టికి తెచ్చిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
- రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.18,969కోట్లు ఇవ్వాల్సి ఉంది
- ఇప్పటి వరకు రూ.3,979 కోట్లు మాత్రమే వచ్చాయి
- వెనకబడిన జిల్లాలకు రూ.24,350 కోట్లు రావాల్సి ఉండగా రూ.1050 కోట్లే వచ్చాయి
- సవరించిన ప్రాజెక్టు అంచనా రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాల్సి ఉంది
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో పునరావాస చర్యలకు రూ.16వేల కోట్లు విడుదల చేయాలి
- పారిశ్రామిక ప్రోత్సహకాలు, పన్ను మినహాయింపులు చట్టంలో పెట్టారు
- వాటిని వెంటనే అమలుచేయాల్సిందిగా సిఫార్సు చేయండి
- కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటును వెంటనే ప్రకటించాలి
- గోదావరి-పెన్నా లింక్ రిజర్వాయర్ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చేలా సహాయపడాలి
- 2020-25 వరకు స్థానిక సంస్థలకు రీసోర్స్ గ్యాప్ కింద నిధులు ఇచ్చేలా సిఫార్సు చేయండి
- రీసోర్స్ గ్యాప్ కింద రూ.40,543 కోట్లు ఇచ్చేలా సిఫార్సు చేయాలి
ఇదీ చదవండి: