జగన్ వ్యక్తిత్వంతో రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సొంత పార్టీలోనే జగన్ తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై నేతలతో చర్చించారు. జాతీయ మీడియా కూడా జగన్ విధానాలను తప్పు పట్టిందని గుర్తు చేశారు. ప్రజల్లో కూడా అమరావతిపై చర్చ జరుగుతోందన్న చంద్రబాబు... అమరావతి వ్యవహారంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ మూర్ఖత్వంతోనే ఈ పరిస్థితి...
మనకు ఓ నగరం అంటూ లేకపోతే బిడ్డల భవిష్యత్తు ఏంటి అనే ఆవేదన ఉందని నేతలతో చంద్రబాబు అన్నారు. ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రం పోవాలా అని భయపడుతున్నారన్న చంద్రబాబు... ఇతర రాష్ట్రాల్లో కూడా 75శాతం స్థానికులకే ఉద్యోగాలు అని నిర్ణయం తీసుకుంటే మనవాళ్ల పరిస్థితి ఏంటనే భయం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మూర్ఖత్వంతోనే ఈ పరిస్థితి ఎదురవుతోందని ధ్వజమెత్తారు.
ఆదాయ మార్గం ఎలా..?
రాష్ట్రానికి ఆదాయ మార్గం ఎలా అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందన్న చంద్రబాబు... కుటుంబ సభ్యులు కలిసి ఉండాలన్నా అనుమతి తీసుకోవాలనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి కలసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండీ... కొత్త జిల్లాల ఆలోచన లేదు: మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్