రాజధాని ప్రాంతం దొండపాడులో మృతిచెందిన కొమ్మినేని మల్లికార్జునరావు కుటుంబాన్ని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయనతో పాటు.. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. రాజధానిని అమరావతిని తరలిస్తారనే మనస్తాపంతో చనిపోయిన మల్లికార్జునరావు.. వైకాపా కార్యకర్తగా పనిచేశారని.... ఓటేసి గెలిపించిన వారినే మోసం చేయడం దుర్మార్గమని చంద్రబాబు విమర్శించారు.
రాజకీయం వేరు... అభివృద్ధి వేరు అనేది తెలుగుదేశం పార్టీ విధానమని చంద్రబాబు చెప్పారు. న్యాయం కోసం పోరాడుతున్న రాజధాని రైతులకు సంఘీభావంగా రాష్ట్రమంతా ఏకమైందన్నారు. స్వాతంత్ర్య పోరాటం కోసం తమ ఆభరణాలు, ఆస్తులు ఇచ్చినట్లే రాజధాని రైతుల కోసం ప్రజలు విరాళాలు ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యంగా మార్చారని ధ్వజమెత్తారు. రాజధాని రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని... అమరావతిని కాపాడుకునే వారి పోరాటానికి తెలుగుదేశం పార్టీ వెన్నంటి నిలుస్తుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
రైతు మల్లికార్జునరావు కుమారుడు నాగేశ్వరరావుతో చంద్రబాబు మాట్లాడారు. తన తండ్రి మల్లికార్జునరావు.... బోస్టన్ కమిటీ నివేదిక టీవీలో చూస్తుండగానే మనస్తాపానికి గురై గుండెపోటుతో చనిపోయారని నాగేశ్వరరావు తెలిపారు. పిడుగురాళ్లలో తాము 2004లోనే భూములు కొన్నామంటూ డాక్యుమెంట్లు చూపించారు.
ఇదీ చదవండి: