అమరావతి రైతుల పోరు 27వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధించి భారీగా పోలీసులను మోహరించినప్పటికీ...ప్రైవేటు ప్రదేశాల్లో రైతులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. అమరావతి ఆందోళనలు అణిచివేసేందుకు ...ప్రైవేట్ వ్యక్తులు ఉద్యమంలోకి చొరబడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, మీడియా ప్రతినిధులు అని చెప్తూ...తమలో చొరబడి హింసాత్మక ఘటనలకు ప్రేరేపిస్తున్నారని మండిపడుతున్నారు.
ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా పోలీస్ యూనిఫాంలో కొందరు తిరుగుతున్నారంటూ వారికి సంబంధించిన ఫోటోలను బయటపెట్టారు. శాంతియుతంగా చేస్తున్న ఆందోళనలు, నిరసనల్లో తమపై దౌర్జన్యాలకు పాల్పడుతూ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే గుర్తింపు కార్డులు అడుగుతున్న పోలీసులు వారేందుకు గుర్తింపు కార్డులు పెట్టుకోవడంలేదంటూ రైతులు నిలదీస్తున్నారు. గుర్తింపు కార్డులు లేని వారిని ఎలా నమ్మేదని మండిపడుతున్నారు.పోలీసులు అరెస్ట్‌లు, బెదిరింపులను లెక్కచేసేది లేదని రైతులు తేల్చిచెబుతున్నారు. అమరావతిని తరలిస్తే అది తమ ప్రాణాలు విడిచాకే అని తెగేసి చెప్తున్నారు.
నేడు మందడం, తుళ్లూరుల్లో మహాధర్నాలు... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెంలో రైతులు పూజలు నిర్వహించి నిరసనలు తెలపనున్నారు. పోలీసులు అడ్డుకుంటే ఇళ్లు, ఆలయాల వద్దే ఆందోళనలు కొనసాగించనున్నారు. ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు గ్రామాలతో పాటు కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ ప్రజాసంఘాలు, రాజకీయపక్షాలు రాజధానిగా అమరావతే కొనసాగాలంటూ ఆందోళనలు చేపట్టనున్నాయి.
ఇదీచదవండి