అమరావతి రైతులకు మరింత లబ్ధి కలిగేలా సీఎం సూచనలు చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా.. రాజధానిపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు తెలిపారు. సీఎంతో హైపవర్ కమిటీ సమావేశ వివరాలను బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అమరావతిలో నిర్మాణాల్లో ఉన్న భవనాలన్నీ పూర్తిచేస్తామని మంత్రి పేర్కొన్నారు. అన్ని భవనాలు ఉపయోగించుకోనున్నట్లు తెలిపారు.
మూడ్రోజుల శాసనసభ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు. హైపవర్ కమిటీ మూడుసార్లు సమావేశమై చర్చించిన అంశాలను సీఎంతో చర్చించినట్లు తెలిపారు. అమరావతి రైతుల అంశాన్ని హైపవర్ కమిటీ జరిపిన చర్చలు సీఎంకు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
సీఆర్‌డీఏ వెబ్‌సైట్ సాంకేతికలోపాన్ని గుర్తించి వెంటనే సవరించామని మంత్రి బొత్స అన్నారు. సీఆర్‌డీఏకి సంబంధించి నకిలీ ఈమెయిల్ సృష్టించినట్లు తెలుస్తోందన్నారు. రైతులు వచ్చి నేరుగా తనతో మాట్లాడుతున్నారని... ఇప్పటికైనా ఎవరైనా నేరుగా వచ్చి మాట్లాడవచ్చని బొత్స తెలిపారు.