ఎంతోమంది దాతలు దేవాలయాలకు ఇచ్చిన 50వేల ఎకరాల భూములు కొట్టేయడానికి కుట్ర జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి మాజీ సభ్యుడు ఏవీ రమణ ఆరోపించారు. దేవుడి మాన్యాలపై వైకాపా దెయ్యాల కన్నుపడిందంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. గుడిని, గుడిలో లింగాన్ని మింగేవారి నుంచి తిరుమల శ్రీవారు తనని తానే కాపాడుకోవాలన్నారు. పేదల ఇళ్ళ కోసం 50వేల ఎకరాలు అంటూ... ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడాన్ని రమణ తప్పుబట్టారు. పేరుకు పేదల ఇళ్ల కోసం అంటున్నారన్న రమణ... అందుకు ప్రభుత్వ భూములు లేవా అని ప్రశ్నించారు. పేదల పేరుతో ఆలయ భూములు దోచేస్తామంటే... ఊరుకోబోమని హెచ్చరించారు.
భక్తుల మనోభావాల జోలికి వస్తే... దేవుడు జగన్‌ను వదిలిపెట్టడని ఆక్షేపించారు. దేవుడికే రివర్స్ టెండర్ పెడుతున్న ఘనులు సీఎం జగన్ అని మండిపడ్డారు. చంద్రబాబు రూ.136 కోట్లతో అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మించాలనుకుంటే... అక్కడ జనం లేరంటూ శ్రీవారి ఆలయ నిర్మాణ ఖర్చును కూ.30 కోట్లకు కుదించడాన్ని తప్పుబట్టారు. జగన్ ఇళ్లు కట్టడానికి వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని నిలదీశారు. రాజధాని నిర్మిస్తే జనం పెరగుతారన్న ఆయన... ఆలయం గొప్పగా నిర్మిస్తే భక్తులు వచ్చి, ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. అర్థం లేని రద్దుల పద్దులో దేవుడిని కూడా చేరిస్తే ఎలా అని ప్రశ్నించారు. తితిదే ప్రక్షాళన అంటే... దేవుడిని ప్రజలకు దూరం చెయ్యడమా అంటూ నిలదీశారు.
ఇదీ చదవండీ