తెలుగుదేశం 'ఛలో ఆత్మకూరు' నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చలో ఆత్మకూరుకు వెళ్తున్న తెదేపా నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పలువురు నేతలను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు చలో ఆత్మకూరుకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేశారు. అలాగే దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య, శిద్దా రాఘవరావు, అచ్చెన్నాయుడులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే గోవిందుడును అరెస్ట్ చేసి పున్నమి గెస్ట్‌హౌస్‌కు తరలించారు. ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, అశోక్ బాబును, రాజేంద్ర ప్రసాద్, ఎంపీ కేశినేని నాని, నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్ చేశారు. నరసరావుపేటలో చదలవాడ అరవిందబాబు, సింహాద్రి యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి ఆత్మకూరుకు బయలుదేరిన నారా లోకేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
తాడేపల్లి సమీపంలో దేవినేని అవినాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో దేవినేని అవినాష్, తెదేపా కార్యకర్తల వాగ్వాదానికి దిగారు. మరోవైపు ఆత్మకూరు నుంచి చంద్రబాబు ప్రచార రథాన్ని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. మరోవైపు ఎన్టీఆర్ భవన్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భవన్ వద్ద పెద్దఎత్తున బారికేడ్‌లు ఏర్పాటు చేశారు.