ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంలో భాగంగా ఆ సంస్థ కార్మికులు ప్రజారవాణా శాఖలోకి మారనున్నారు. కొత్త శాఖ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జనవరి ఒకటిన అధికారంగా ఆర్టీసీ కార్మికులను అందులోకి మారినట్లు చూపనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల విలీనానికి సంబంధించిన బిల్లుకు ఉభయసభలు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత ప్రజారవాణా శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులివ్వనుంది. దీంతో కొత్త శాఖ ఏర్పాటు ఆరంభమవుతుంది. అనంతరం ఏపీఎస్‌ఆర్టీసీలోని 51,488 కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తారు.
హోదాల మార్పు ఇలా..
ప్రస్తుతానికి ఆర్టీసీలో ఉన్నతాధికారుల హోదాలు మాత్రమే ప్రజా రవాణాశాఖలో మారుతాయి. ఆర్టీసీలో ప్రస్తుతం డిపో మేనేజర్ (డీఎం), డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, రీజనల్ మేనేజర్ (ఆర్‌ఎం), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) వరకు హోదాలు ఉన్నాయి. ప్రజా రవాణశాఖల్లో వారి హోదాలు వరుసగా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, కమిషనర్‌గా మారనున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు ప్రజా రవాణాశాఖలో కూడా అదే పేరుతో కొనసాగనున్నారు. జనవరి ఒకటిన విలీనం జరగనుండగా, ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి ఒకటిన ట్రెజరీ ద్వారా జీతం అందనుంది.
ఎస్బీటీఎస్ ప్రీమియం వెనక్కి
ప్రస్తుతం కార్మికులు ప్రతి నెలా రూ.100 చొప్పున స్టాఫ్ బెనిఫిట్ త్రిఫ్ట్ స్కీమ్ (ఎస్బీటీఎస్)కు ప్రీమియం చెల్లిస్తున్నారు. కార్మికుడు ఆకస్మికంగా మృతి చెందితే ఎస్సీటీఎస్ ద్వారా అతని కుటుంబానికి రూ.లక్షన్నర సాయం అందిస్తారు. ప్రభుత్వంలో ఉద్యోగులకు వేరొక బీమా పథకం ఉండటం వలన ఆర్టీసీ కార్మికుల ఎస్బీటీఎస్ రద్దవుతుంది. ఈ పథకానికి ఇంత కాలం కార్మికులు చెల్లించిన ప్రీమియం డబ్బులు వెనక్కి ఇవ్వనున్నారు. ప్రజా రవాణాశాఖలో కొత్త బీమా పథకానికి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటి వరకు ఫించన్ కోసం స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్‌ఆర్బీఎస్)కు ప్రీమియం చెల్లిస్తూ వచ్చారు. ప్రజార వాణాశాఖలో ఈ పథకం ఉండదు. ఈ పథకం కోసం ఇంతకాలం చెల్లించిన ప్రీమియం డబ్బులను కూడా వడ్డీతో కలిపి వెనక్కి ఇస్తారు.
ఇవీ చదవండి..