పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా ప్రతిపాదించిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబరు 2నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు వైకాపా సర్కార్ సిబ్బంది నియామకాలను కొలిక్కితెస్తోంది. ఇటీవలి పరీక్షల్లో ఎంపికైన వారి ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన అధికారులు... నేటి నుంచి నియామక పత్రాలు అందించనున్నారు. ముఖ్యమంత్రి జగన్ విజయవాడ లోని 'ఏప్లస్' కన్వెషన్ సెంటర్‌లో ఉదయం పదిన్నరకు కొందరు ఉద్యోగులకు నియామపక పత్రాలు అందిస్తారు. ఈ కార్యక్రమానికి కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి హాజర్యే సుమారు 5వేల మంది ఉద్యోగులనుద్దేశించి ప్రసంగిస్తారు.
నియామకపత్రాలు అందుకున్నవారు 30 రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే వారిని ఎంపిక జాబితాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధుల్లో చేరే అభ్యర్థులు ప్రభుత్వ వైద్యశాలల నుంచి శారీరక దార్ఢ్య ధ్రువపత్రాన్ని విధిగా అందించాలని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఇప్పటికే పనిచేస్తున్నవారు బయటకు వచ్చేసినట్లుగా ఆయా సంస్థల నుంచి ధ్రువపత్రం సమర్పించాలని పేర్కొంది. తప్పుడు పత్రాలు సమర్పిస్తే ఉద్యోగం నుంచి తొలగించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
రూ.15 వేల వేతనం చెల్లిస్తామన్న ప్రభుత్వం రెండేళ్ల శిక్షణాకాలంలో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా తొలగించే అధికారం తమకు ఉందని స్పష్టంచేసింది. రెండేళ్లలో నిర్దేశిత ప్రమాణాలకు లోబడి ప్రతిభ కనబరిస్తే రెగ్యులర్ సర్వీసులోకి శాశ్వత స్కేలులో తీసుకుంటామని, లేదంటే తొలగిస్తామని తెలిపింది. మూడేళ్లలో విధి నిర్వహణలో విఫలమైనా, ఉద్యోగం వదిలి వెళ్లాలనుకున్నా ప్రభుత్వం తరఫున అప్పటివరకూ అందుకున్న భత్యాలు, గౌరవ వేతనాలు వెనక్కి ఇచ్చేయాలని వెల్లడించింది. నిబంధనలు, పరిమితులకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఒక నెల నోటీసుతో ఉద్యోగం నుంచి తొలగిస్తామని పేర్కొంది.
మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో మిగిలిన ఖాళీలకు మంగళవారం నుంచి ఎంపిక ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. తుదిజాబితాలో అర్హత సాధించిన కొందరు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాకపోవడం, ఒకరే రెండు, మూడు జిల్లాల్లో ఎంపికవడంతో పోస్టులు ఖాళీ అయ్యే అవకాశం ఉందన్నారు. ఖాళీగా మిగిలే పోస్టుల్లో... జాబితాలో తర్వాత ఉన్న వారికి అవకాశం ఇస్తామన్న గిరిజాశంకర్... ఓసీ, బీసీలకు కటాఫ్ మార్కులు తగ్గవని, ఎస్సీ, ఎస్టీలకు తగ్గే అవకాశం ఉందని చెప్పారు.
ఇదీ చదవండీ... 'ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి'