ఇంజినీరింగ్ కళాశాలల్లో లోపాలపై ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి వివరించనుంది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా కమిషన్ సభ్యులు 14 ప్రత్యేక బృందాలతో 20 ఇంజినీరింగ్ కళాశాలలను సందర్శించారు. అక్కడి స్థితి గతులపై ఓ నివేదికను సీఎంకు అందజేయనున్నారు.
కళాశాలల నిర్వహణ అధ్వాన్నమే
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల నిర్వహణ అధ్వాన్నంగా ఉందని కమిషన్ సభ్యులు గుర్తించారు. అధ్యాపకులు లేకపోవడం, ఒకే ప్రాంగణంలో వివిధ కోర్సుల నిర్వహణ వేతనాల చెల్లింపు రికార్డులు సరిగా లేకపోవడం, మౌలిక వసతుల కొరత, విద్యార్థుల హాజరులో లోపాలు వంటి వాటిని సీఎం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి నుంచి 120 సీట్లకు అనుమతి పొందిన కళాశాలలో మొదటి ఏడాది 15 మంది విద్యార్థులు మాత్రమే ఉంటే వారు కూడా సరిగా తరగతులకు హాజరు కాకపోవడం... ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంటెక్, డిప్లొమా, బీఈడీ కోర్సులు నిర్వహణలో లోపాలు కమిషన్ సభ్యుల తనిఖీల్లో వెలుగుచూశాయి.
అంతర్గత మార్కుల కేటాయింపుల్లోనూ గందరగోళమే
ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు అంతర్గత మార్కుల కేటాయింపుల్లో లోపాలు, ప్రయోగశాలల్లోనూ కంప్యూటర్లు, ఇతర పరికరాల కొరత వంటి వాటిపై కమిషన్ సభ్యులు ముఖ్యమంత్రితో చర్చించనున్నారు. డిసెంబర్ మొదటి వారంలో మరో విడత కమిషన్ సభ్యులు తనిఖీలు జరుపుతారు.
ఇదీ చూడండి: