జగనన్న విద్యావసతి పథకం కింద... వసతి, ఆహార ఖర్చులకు ఏటా ఇవ్వబోతున్న రూ.20వేల ఆర్థిక సాయాన్ని... విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద సంక్షేమ గృహాలు, కళాశాలల అనుబంధ వసతి గృహాల్లో ఉండి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ఆపై కోర్సులు చదివే విద్యార్థులకూ సాయం అందిస్తారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది.
త్వరలోనే మార్గదర్శకాలు..
సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ... చదివే విద్యార్థులకు నెలవారి మెస్ ఛార్జీలను మినహాయించుకొని... మిగతా మొత్తాన్ని చెల్లించనుంది. ఈ పథకం మార్గదర్శకాలపై త్వరలో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డిగ్రీ, ఇంజినీరింగ్ ఆపై కోర్సులు చదివే వారందరికీ... బోధనా రుసుములకు అదనంగా... వసతి ఆహార ఖర్చుల కింద ఏటా గతంలో రూ.5 వేలు ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.20 వేలు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ పథకం కింద అర్హత పొందిన విద్యార్థులకు ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వనుంది. కుటుంబ వార్షిక ఆదాయం పెంచటంతో... కొత్తగా 30 వేల మంది విద్యార్ధులు దీని పరిధిలోకి వచ్చే అవకాశముంది.
ఇదీ చూడండి : 'ఆంగ్ల మాధ్యమం' అమలుకు జీవో జారీ