బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రియల్ ఎస్టేట్‌కు ఊతమిచ్చేలా ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణాన్ని చేపట్టేందుకు ఈ మిషన్‌కు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించి అక్కడ భవన సముదాయాలను నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం.. మిగతా భూములను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు విక్రయించనుంది. సమీకృత ప్రభుత్వ భవనాల సముదాయాన్ని నిర్మించి జిల్లా సచివాలయంగా దాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
జేసీలకు ఆదేశాలు
ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల వివరాలు సేకరించి పంపాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాల్లో ప్రభుత్వ భూములు, ఆక్రమణలు, వివాదాల్లో ఉన్న భూముల వివరాల్ని కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. వీలైనంత త్వరగా ఈ వివరాలను సమర్పించాల్సిందిగా జేసీలకు సూచనలు జారీ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పోరేషన్‌తో కలిసి ఈ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టనుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా భారీ మొత్తంలోనే ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధుల్ని ఇతర పథకాలకు వినియోగించుకోవచ్చన్నది ఆలోచన. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ మిషన్ డైరెక్టర్‌గా ఐఎఎస్ అధికారి ప్రవిణ్ కుమార్‌ను రాష్ట్రప్రభుత్వం నియమించింది.
ఇదీ చదవండి:"బిల్డ్ ఏపీ" పేరుతో మరో కొత్త పథకం