రిజిస్ట్రేషన్‌శాఖలో అవినీతి, అక్రమాలు అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. నవంబరు 1నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు డాక్యుమెంట్ లేఖరీలు వివిధ రకాలుగా స్టాంపు పేపర్లపై క్రయవిక్రయాల వివరాలు నమోదుచేస్తున్నారు. కొత్తవిధానంలో క్రయ, వియక్రయదారులే స్వయంగా డాక్యుమెంట్‌ను తయారు చేసుకుని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఎక్కడా మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. క్రయవిక్రయాల కోసం 16 రకాల నమూనాలతో ధ్రువపత్రాలను రూపొందించారు. ఇవన్నీ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్లో ఉంటాయి. క్రయ, విక్రయదారులు ఈ డాక్యుమెంట్లలో తమ వివరాలు నింపి అప్‌లోడ్ చేయాల్సిఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నమూనాలను ఉపయోగించుకోవచ్చు. నమూనా పత్రంలో ఉన్న వివరాలు కాకుండా అదనపు అంశాలు ఉన్నా దీనిలో నమోదు చేసుకునే అవకాశం ఉంది. సిద్ధం చేసుకున్న మొత్తం డాక్యుమెంట్‌ను ప్రింట్ తీసుకోవాలి. దానితో రిజిస్ర్టేషన్ కార్యాలయానికి వెళ్తే..సదరు డాక్యుమెంట్‌ను స్కాన్ చేసి, అధికారులు రిజిస్ర్టేషన్ ప్రక్రియను నిర్వహిస్తారు. తొలిసారిగా ప్రవేశపెడుతున్న కొత్త విధానాల ఫలితంగా.. రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నగదు రహిత కార్యకలాపాలకు పెద్దపీట వేయనున్నారు. రిజిస్ట్రేషన్ రుసుమును కూడా ఆన్ లైన్‌లో చెల్లించేందుకు వీలు కల్పిస్తున్నారు. క్రయ, విక్రయాల డాక్యుమెంట్‌ను వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన తర్వాత టైంస్లాట్‌ను పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పటికే విశాఖ, కృష్ణాజిల్లాలో ఎంపిక చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇందులోని పలు లోపాలను గుర్తించి, వాటిని సవరించారు. నవంబర్ ఒకటో తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రక్రియను అన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలపై నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేసి వచ్చేనెల 1న నూతన విధానాన్ని అమలు చేయనున్నారు.
ఇదీ చదవండీ... శ్రీశైలం, సాగర్‌కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల