ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రధాన రహదారుల నిర్మాణాలతో పాటు రైతులకిచ్చిన లే అవుట్‌లలో మౌలికవసతులు అభివృద్ధి చెయ్యాలని సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇప్పటికే చేపట్టిన గృహ నిర్మాణాల పనులు కొనసాగించాలని సీఎం నిర్ణయించారు. డిసెంబర్ నుంచి ఈ పనులు తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. అవసరమైన నిధులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం...రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులును దృష్టిలో పెట్టుకుని...అనవసర ఖర్చులు తగ్గించాలన్నారు.
హ్యాపీనెస్ట్ పనులు జనవరి 1 నుంచి:
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాలు, శాసనసభ, హైకోర్టు భవనాల నిర్మాణంపై మాత్రం నిపుణుల కమిటీ నివేదిక వచ్చాకే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిలో కొనసాగించే పనుల పరిమాణం, అంచనా వ్యయాల తగ్గింపుపై ఐఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలని సీఎం సూచించారు. హ్యాపీనెస్ట్ పనులు జనవరి 1 నుంచి ప్రారంభించాలని ఈ ప్రాజెక్టుపై రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు .రాజధానిలో ప్రధాన అనుసంధాన రహదారి పక్కనే 7 అంతస్తులుగా నిర్మిస్తున్న సీఆర్‌డీఏ కార్యాలయ భవనం పనులూ త్వరలోనే ప్రారంభించనున్నారు.
అవసరంమేరకే రహదారుల నిర్మాణం:
రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలు, 44 వేల కోట్ల రూపాయల పనులకు పిలిచిన టెండర్లు, వివిధ దశల్లో నిర్మాణల పనులపై సీఆర్‌డీఏ సమీక్షలో చర్చించారు. ప్రస్తుతం రాజధాని జనాభా 1.5 లక్షలు మాత్రమే ఉన్నందున...భారీ రహదారులు అప్పుడే అవసరం లేదని నిర్ణయానికి వచ్చారు. రాజధానిని బయటి ప్రాంతాలతో అనుసంధానించేందుకు అవసరమైన మేరకే రహదారుల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. 8, 6 వరుసలుగా నిర్మించాలనుకున్న రహదారుల వెడల్పు తగ్గించాలని ...అవసరమైనప్పుడు విస్తరించుకొనేందుకు వీలుగా ఖాళీ ప్రదేశం వదిలిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. రోడ్ల నిర్మాణం చేయగా... మిగిలిన భూమిలో ల్యాండ్ స్కేపింగ్, సుందరీకరణ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలకు తగ్గట్టుగా ప్రాధాన్యక్రమంలో వీలైనంత త్వరగా పనులు పూర్తి చెయ్యాలని ఆదేశించారు. పూర్తికావొచ్చే పనులుపై ముందుగా దృష్టిపెట్టాలన్నారు. ప్రణాళికలో ఎక్కడా తప్పులు ఉండటానికి వీల్లేదన్నారు. మౌలికవసతుల పనుల అంచనా వ్యయం తగ్గించుకొని, రీ టెండరింగ్‌కు, రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలని సీఎం సూచించారు.
రాజధాని పనులకు, మౌలికవసతుల అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు అవసరం అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. ఏడాదికి రూ.5 వేల కోట్ల చొప్పున...వచ్చే మూడేళ్లలో నిధులు సమకూర్చాలని కోరారు. ప్రభుత్వమే ఈ నిధులు గ్రాంటుగా ఇవ్వాలని...బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలంటే సర్కార్ గ్యారంటీ ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించారు. నిపుణులతో సంప్రదించి తగిన ప్రతిపాదనలతో రావాలని సీఎం సూచించారు.