ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా విభాగంలో విలీనానికి ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సు చేసిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆంజనేయరెడ్డి కమిటీ సిఫార్సులను మంత్రివర్గం యథాతథంగా ఆమోదించిందని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్న మంత్రి... 52వేల మంది ఆర్టీసీ కార్మికులు ప్రజా రవాణా విభాగంలో విలీనం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియ అంతా 3 నెలల్లో పూర్తిచేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నియమ నిబంధనలు ఆర్టీసీ కార్మికులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్లు వివరించారు. ఆర్టీసీకి ఉన్న రూ.3300 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు.
కొత్త ఇసుక విధానాన్ని మంత్రివర్గం ఆమోదించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇసుక రవాణాలో పారదర్శకంగా లోపరహితంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అవినీతికి ఆస్కారం లేకుండా తక్కువ ధరకు ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్న మంత్రి... ప్రజలు ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేసుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇసుక బుక్ చేసుకున్న వినియోగదారు రవాణా వాహనాన్ని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకోవచ్చని వివరించారు. సరసమైన ధరకు ఇసుక అందించే విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న మంత్రి... స్టాక్ యార్డుల ఏర్పాటు ఏపీఎండీసీకి తప్ప మరెవరికీ లేదని స్పష్టం చేశారు. ఎవరైనా స్టాక్ యార్డులు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సొంతంగా ప్యాసింజర్ ఆటోలు నడుపుకునే వారికి ఏటా రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. కుటుంబంలో భార్యాభర్తలను ఒక యూనిట్‌గా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మేజర్ కుమారుడు లేదా కుమార్తె ఉంటే వారిని మరో ప్రత్యేక యూనిట్‌గా పరిగణలోకి తీసుకోనున్నట్లు వివరించారు. వాహనాల బీమా, మరమ్మతులకు ఈ ఆర్థిక సహాయం కేటాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు. జగన్ పాదయాత్రలో హామీ మేరకు ఏటా రూ.10 వేలు ఇవ్వనున్నట్లు వివరించారు. ఆర్థిక సాయానికి రూ.400 కోట్ల మేర ఖర్చు అవుతుందని అంచనా వేశామన్న మంత్రి... దాదాపు 4 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఈనెల 10 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి అవకాశం కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ నాలుగో వారంలో దరఖాస్తుల పరిశీలన ఉంటుందని వివరాలు వెల్లడించారు.
పేద యువతుల వివాహానికి పెళ్లి రోజున పెళ్లి కానుక అందించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. శ్రీరామ నవమి నుంచి పెళ్లి కానుక పథకం అమల్లోకి వస్తుందన్నారు. ఈ పథకానికి రూ.750 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల వివాహానికి రూ.లక్ష ఇవ్వాలని నిర్ణయించామన్న మంత్రి... ఎస్సీ, ఎస్టీలు కులాంతర వివాహం చేసుకుంటే రూ.1.2 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. బీసీల వివాహానికి రూ.50 వేలు, వివాహానికి రూ.లక్ష, దివ్యాంగుల వివాహానికి రూ.1.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆశా వర్కర్ల వేతనాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచాలని నిర్ణయించారు.
క్రీడాకారులను ప్రోత్సహించాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్లు మంత్రి పేర్ని నాని చెప్పారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి రూ.5 కోట్లు, బంగారు పతకం సాధిస్తే రూ.5 లక్షలు, రజత పతకానికి రూ.4 లక్షలు, కాంస్య పతకానికి రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ సాధించిన సింధును అభినందిస్తూ తీర్మానం చేసినట్లు చెప్పారు. ఆంధ్రాబ్యాంకు పేరు యథాతథంగా ఉంచేలా ప్రధానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రిని సహచర మంత్రులు కోరినట్లు వివరించారు. కాంట్రాక్టు సిబ్బందిని తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టు సిబ్బందిని తొలగిస్తున్నామనే దుష్ప్రచారం నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ... 'అప్పుడు ముద్దులు..ఇప్పుడు లాఠీదెబ్బలా?'