ఈ నెల 20వ తేదీ నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ప్రభుత్వంలోని మంత్రులు, అధికారులతో ఏర్పాటైన హైపవర్ కమిటీ నివేదికపై శాసనసభ చర్చించనుంది. రాష్ట్రంలో రాజధాని కొనసాగింపు, పరిపాలన వికేంద్రీకరణపై విశ్రాంత ఐఏఎస్ జిఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలు ఇచ్చాయి. వీటిని పరిశీలించడానికి పదిమంది మంత్రులు, ఆరుగురు అధికారులు, సీఎం ముఖ్యసలహాదారుతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. హైపవర్ కమిటీ ఇప్పటికే రెండు దఫాలు సమావేశమయింది. 13వతేదీన మరోమారు సమావేశం కానున్న కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. దీనిపై చర్చించేందుకు శాసనసభను మూడు రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశపరుస్తున్నారు.
తెరపైకి మూడు రాజధానులు
రాష్ట్రంలో పరిపాలనను వికేంద్రీకరించడానికి అనువుగా శాసన, పరిపాలన, న్యాయ వ్యవహారాలను వేర్వేరు చోట్ల నిర్వహించాలని రెండు కమిటీలూ సూచించాయి. ప్రస్తుత రాజధాని అమరావతిలో శాసన వ్యవస్థను కొనసాగిస్తూ.. సచివాలయాన్ని విశాఖలో, హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని కమిటీలు సూచించాయి. ప్రభుత్వం కూడా దాదాపు ఇదే ఆలోచనతో ఉంది. ఈ నివేదికలను అధ్యయనం చేయడంతో పాటు.. పరిపాలనా వికేంద్రీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హైపవర్ కమిటీని ఏర్పాటు చేశారు. హైపవర్ కమిటీ సైతం పరిపాలన వికేంద్రీకరణకే మొగ్గు చూపుతోంది.
అమరావతిలో ఆందోళన
ప్రభుత్వ ఆలోచన బయటకు వచ్చినప్పటి నుంచి అమరావతిలో అగ్గిరాజుకుంది. పూర్తిస్థాయి రాజధానిని ఇక్కడే కొనసాగించాలంటూ ప్రజలు 25రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. రాజధాని పోరు రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనుంది. తమ ఆలోచనను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.