39వ రోజూ రైతులు ఉద్యమబాట వీడలేదు. తమ ఆవేదన ప్రభుత్వం అర్థం చేసుకునేవరకూ వెనుకడుగు వేసేది లేదంటున్న రైతులు... ఇవాళ మందడం నుంచి అనంతవరం వెంకన్నకొండ వరకూ పాదయాత్రగా వెళ్లారు. వెలగపూడి, రాయపూడి, తుళ్లూరు మీదుగా ర్యాలీగా వెళ్లి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
మందడం నుంచి మొదలైన పాదయాత్రలో రాజధాని గ్రామాల రైతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఆ ఏడుకొండల వాడు తమ మొర విని... అనుగ్రహం ప్రసాదిస్తాడనే ఆశాభావంతో ఉన్నట్టు మహిళలు చెబుతున్నారు. మందడం నుంచి వెలగపూడి, రాయపూడి మీదుగా సాగిన యాత్రకు ఆయా ప్రాంతాల్లో ఎక్కడికక్కడ రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున కలుస్తూ పాదయాత్రలో పాల్గొన్నారు.
రాజధాని ప్రాంతంలోని భూములను.... ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేయడాన్ని రైతులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పేదలకు ఇళ్లస్థలాల పేరిట.. ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా... రాజధాని తరలింపునకు అంగీకరించేది లేదని తేల్చిచెబుతున్నారు.
సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు పాదయాత్రు చేరుకునేసరికి రోడ్డు కూడా కనిపించనంతగా మహిళలు, రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు.