రాజధాని నిపుణుల కమిటీ సిఫార్సులపై ఆ ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయం - మందడం వై జంక్షన్ వద్ద అమరావతికి రైతులు ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి జీఎన్ రావు కమిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రహదారికి అడ్డుగా బుల్డోజర్ పెట్టడం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించారు. బారికేడ్లు తొలగించి సచివాలయం వైపు పరుగులు తీశారు. రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరగటం వల్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాదాపు 29 గ్రామాల రైతులు సచివాలయానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకూ ఆందోళన విరమించేది లేదని రైతులు తేల్చి చెప్పారు.
వరద ఎప్పుడొచ్చింది
కమిటీ ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదని రాజధాని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ రాజధానిలో ఎక్కడ పర్యటించిందో చెప్పాలన్నారు. జీఎన్ రావు కమిటీకి ఉన్న చట్టబద్ధత ఏంటని ప్రశ్నించారు. రాజధానిలో ముంపు ప్రాంతాలు ఏమైనా ఉన్నాయా అని నిలదీశారు. రాజధానిలో వరద ముంపు ఉంటే.. విశాఖలో పరిస్థితి ఏంటని ధ్వజమెత్తారు. రాజధానిలో వరద ఎప్పుడు వచ్చిందో కమిటీ చూపించాలని... మూడు పంటలు పండే పొలాలు తీసుకుని వారి పొట్ట కొడుతున్నారని వాపోయారు.
రాజకీయ లబ్ధి కోసమే
సీఎం రాజకీయ లబ్ధి కోసమే రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారని.. కమిటీ పేరుతో తమను మోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పొలాల్లో కార్యాలయాలు కట్టి ఇప్పుడు వరద ప్రాంతమని చెబుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలని ఓట్లు అడిగి అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. సీఎం వేసిన కమిటీ ఆయనకు అనుకూలంగానే నివేదిక ఇచ్చిందని.. తమ ప్రాంతంలో విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అమరావతి రైతులు ఆరోపించారు.
ఇదీ చదవండి: