హైదరాబాద్‌లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఈ భేటీలో ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య రాష్ట్ర రాజధాని అంశం చర్చకొచ్చింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డును తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. అయితే రాజధాని విషయంలో ప్రభుత్వం ఆలోచన వేరుగా ఉన్న నేపథ్యంలో బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తారని తెలంగాణ అధికారులు ప్రశ్నించారు.
వరద సమయంలో అధికంగా ఉపయోగించుకున్న జలాల అంశాన్ని తేల్చేందుకు కమిటీ వేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు నిర్ణయించింది. బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు పదకొండో సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇరు రాష్ట్రాల ఇంజినీరింగ్ చీఫ్‌లు, ఇంజినీర్లు సమావేశంలో పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపులు, ఇతర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు బోర్డు చైర్మన్ ఆర్కే గుప్తా తెలిపారు. వరద వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ అధికంగా ఉపయోగించుకున్న జలాల విషయం సమావేశంలో చర్చకు వచ్చినట్లు వెల్లడించారు. అదనంగా వినియోగించుకున్న నీటిని ఏపీ కోటాలో వేయాలని తెలంగాణ కోరిందని.. ఏపీ మాత్రం వరద జలాలను లెక్కించవద్దని చెప్పినట్లు వెల్లడించారు. దీంతో ఈ అంశంపై తేల్చేందుకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది.
క్రాస్ వాల్స్ తొలగించడం అసాధ్యం
వచ్చే నీటి సంవత్సరంలోగా కమిటీ ఈ అంశాన్ని తేల్చనుంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువపై నిర్మించిన క్రాస్ వాల్స్ విషయాన్ని ప్రస్తావించిన ఏపీ.. ఆ గోడలను తొలగించాలని కోరింది. అయితే క్రాస్ వాల్స్‌ను ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించారని... ఇప్పుడు తొలగించడం సాధ్యం కాదని తెలంగాణ స్పష్టం చేసింది.
గోదావరి జలాలు.. కృష్ణాకు..
గృహ వినియోగానికి తీసుకున్న నీటిని 20 శాతమే లెక్కించాలన్న తెలంగాణ ప్రతిపాదన... పట్టిసీమ, పోలవరం నుంచి గోదావరి జలాలను కృష్ణాకు తరలిస్తున్నందున తమకు అదనంగా 45 టీఎంసీలు కేటాయించాలన్న తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర జల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డు నిర్ణయించింది.