తెలంగాణ రాష్ట్రం మహబూనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 13 మంది కూలీలు మృతిచెందారు. ప్రమాద సమయంలో ఆటోలో 15 మంది ఉన్నట్లు సమాచారం. కొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో కూలి పనులు ముగించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కిక్కిరిసి ఉన్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న 13మంది కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జనుజ్జయ్యింది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దీనిబట్టి లారీ ఎంత బలంగా ఢీకొట్టిందో అర్థం చేసుకోవచ్చు.
రోడ్డే మింగేసిందా?
గతంలోనూ ఇదే ప్రాంతంలో పలు ప్రమాదాలు జరిగాయని కొత్తపల్లి వాసులు పేర్కొంటున్నారు. జడ్చర్ల నుంచి కల్వకుర్తి వెళ్లే రహదారిలో కొత్తపల్లి వద్ద రోడ్డు సరిగా లేని కారణంగానే తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక్కడున్న మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించే పరిస్థితి లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని కోరుతున్నారు.