2019 ముగిసే సమయం దగ్గరకొచ్చింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఫుడ్ ట్రెండ్స్ గమనిస్తే.. బిర్యానీ అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ 'స్విగ్గీ ఇండియా' వెల్లడించిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన ఆహార పదార్థంగా బిర్యానీ ఘనత సాధించింది.
ఈ ఏడాది ప్రతి నిమిషానికి 95 బిర్యానీలు డెలివరీ చేసింది స్విగ్గీ.. అంటే సెకనుకు 1.6 బిర్యానీలు అన్నమాట.
బిర్యానీల్లోనూ.. బోన్లెస్ చికెన్ బిర్యానీ, చికెన్ ధమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ ఎక్కువ ఆదరణ పొందాయి.
టాప్ 5 ఆర్డర్లు వీటికే...
చికెన్ బిర్యానీ, మసాలా దోశ, పనీర్ బటర్ మసాలా, చికెన్ ఫ్రైడ్ రైస్, మటన్ బిర్యానీ ఈ ఏడాది ఎక్కువగా ఆర్డర్లు వచ్చిన ఐదు ఉత్తమ ఆహారపదార్ధాల జాబితాలో ఉన్నాయి. ఎగ్ ఫ్రైడ్ రైస్, వెజ్ బిర్యానీ, తందూరీ చికెన్, దాల్ మఖానీ వంటి వాటినీ మనవాళ్లు తెగ ఇష్టపడ్డట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఆహారం.. ఆరోగ్యం..
ఆరోగ్యకరమైన ఆహారానికి ఈ ఏడాది గిరాకీ భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కీటో ఆహార పదార్థాల విక్రయాలు ఈ ఏడాది 306 శాతం పెరిగాయంటే గిరాకీ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కీటో బ్రౌనీస్, కీటో ఫ్రెండ్లీ టస్కన్ చికెన్, హెల్తీ రెడ్ రైస్ పోహా వంటివి ఎక్కువగా ఆర్డర్లిచ్చిన జాబితాలో ఉన్నాయి.
ఫిట్నెస్పై దృష్టి సారించే వారికి కీటో బ్రౌనీస్ ఉపయోగకరమైన.. ఆహార పదార్ధంగా చెప్పొచ్చు. ఆరోగ్యకరమైన ఆహార పదార్ధాల మొత్తం ఆర్డర్లు ఈ ఏడాది 249 శాతం పెరిగినట్లు గణాంకాల్లో వెల్లడైంది.
పిజ్జాలో శాకాహార టాపింగ్సే అధికం..
కొత్త కొత్త వంటకాలను రుచి చూసే ధోరణి దేశంలో ఇటీవల బాగా పెరిగింది. అయితే పిజ్జాలపై టాపింగ్స్లో మాత్రం శాకాహారం వైపే మనవాళ్లు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.
ఈ ఏడాది పిజ్జా ఆర్డర్లలో టాపింగ్స్గా.. చీజ్, ఉల్లి, పనీర్, ఎక్స్ట్రా చీజ్, పుట్టగొడుగులు, క్యాప్సికం, మొక్కజొన్న, జలాపినోస్, ఆలీవ్ అధికంగా ఉన్నట్లు తెలిసింది.
మిఠాయిల్లో ఇవే టాప్..
భారతీయ వంటకాల్లో మిఠాయిలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ ఏడాది ఎక్కువగా ఆన్లైన్లో ఆర్డర్లిచ్చిన మిఠాయిల జాబితా మొత్తంలో.. గులాబ్ జామూన్, మూంగ్ దాల్ హల్వా అగ్రస్థానాల్లో నిలిచాయి.
మొత్తం ఆర్డర్లపరంగా చూస్తే ఈ ఏడాది 17,69,399 గులాబ్ జామూన్లు, 2,00,301 హల్వాలకు ఆన్లైన్లో ఆర్డర్లు వచ్చాయి.
డిసెర్ట్ల జాబితాలో కొత్తగా ఫలూడా చేరింది. ఫలూడాకు 11,94,732 ఆర్డర్లు వచ్చాయి. ఈ ఏడాది మొత్తం 3 లక్షల కేక్లకు ఆన్లైన్లో ఆర్డర్లు రాగా.. వాటిలో బ్లాక్ ఫారెస్ట్ రకం ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలిసింది.
పై గణాంకాలన్నీ ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య.. 'స్విగ్గీ' ఆర్డర్ల విశ్లేషణ ద్వారా తీసుకున్నవి. స్విగ్గీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం 500 పట్టణాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
ఇదీ చూడండి:'బకాయిలు వెంటనే చెల్లించి.. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్'