సరదాగా పక్కవారిని ఏడిపించి నవ్వుకోవడం మంచిదే. కానీ సరదా శ్రుతిమించితే? ఈ బెంగళూరు ఆకతాయిలకు ఎదురైన అనుభవమే మిగులుతుంది. జనాల చెవిలో పూలు పెడదామనుకుని వెళ్లి పోలీసులకు చిక్కారు ఏడుగురు యువకులు. ఇంతకీ వీరి దెయ్యం వేషాలేమిటో చూద్దాం..
వెర్రివాళ్లను చేయడమే పని
ఆర్టీ సిటీకి చెందిన షాన్ మాలిక్, నవీద్, సాజిల్ మొహమ్మద్, మహ్మద్ అకుబ్, సాకిబ్, సయ్యద్ నబిల్, యూసుఫ్ అహ్మద్ ఓ బృందం. వీరు సరదాగా ప్రాంక్ వీడియోలు చేస్తూంటారు. ఎవరికీ కనబడకుండా కెమెరాను ఉంచుతారు. దారిలో వెళ్లేవారిని భయపెట్టి, పిచ్చి ప్రశ్నలు వేయడం వంటివి చేసి వారిని వెర్రివాళ్లను చేస్తుంటారు.
భయపెడదామని వెళ్లి..
ఎప్పటిలాగే.. యశ్వంత్పురలోనూ ప్రాంక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ బృందంలోని కొందరు అర్ధరాత్రి.. తెల్లని గౌను ధరించి, విగ్ పెట్టుకుని కొరివి దెయ్యంలా తయారయ్యారు. రోడ్డుపై అందరిని భయపెట్టడం మొదలుపెట్టారు. వీరి ప్రాంక్లకు భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇలా ప్రజలను భయపెట్టి.. వీడియోలు తీసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసి, డబ్బులు ఆర్జించే ఆ ఏడుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:వంట గదిలోని పొగ పీల్చితే గుండెపోటు!