దిల్లీ శాసనభ ఎన్నికలకు ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు నామినేషన్ వేశారు. నామపత్రాల స్వీకరణకు ఆఖరి రోజున రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో 6 గంటల ఎదురుచూపుల తర్వాత దస్త్రాలను సమర్పించారు.
వరుసగా రెండో రోజు...
న్యూ దిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కేజ్రీవాల్. భాజపా అభ్యర్థి సునీల్ యాదవ్ ఆయనకు ప్రధాన ప్రత్యర్థి. సోమవారమే కేజ్రీవాల్ నామినేషన్ వేయాల్సి ఉంది. అయితే... రోడ్‌షో ఆలస్యం కావడం వల్ల కుదరలేదు. ఈ రోజు నామపత్రాలు సమర్పించేందుకు రిటర్నింగ్ అధికారికి కార్యాలయానికి త్వరగానే చేరుకున్నారు అరవింద్. అయితే... వెళ్లిన వెంటనే ఆయనకు గట్టి షాక్ తగిలింది. మీకన్నా ముందు 44 మంది వచ్చారంటూ.... 45వ నెంబరు టోకెన్‌ను ముఖ్యమంత్రికి ఇచ్చారు అధికారులు. మీ వంతు వచ్చాక పిలుస్తామంటూ అనేక గంటలుగా ఆయన్ను అక్కడే కూర్చోబెట్టారు.
"నామినేషన్ వేసేందుకు ఎదురుచూస్తున్నా. నా టోకెన్ నెం.45. నామినేషన్లు వేసేందుకు చాలా మంది వచ్చారు. ప్రజాస్వామ్య పండుగలో ఇంతమంది భాగస్వాములు అయ్యేందుకు రావడం సంతోషకరం."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
దిల్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఈరోజే ఆఖరి రోజు కావడం ఉత్కంఠను మరింత పెంచింది. సాధారణంగా మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. అయితే... టోకెన్ తీసుకున్నవారి నుంచి ఎంత ఆలస్యమైనా నామపత్రాలు స్వీకరిస్తామని చెప్పారు అధికారులు.
కుట్రపూరితం!
నామినేషన్ స్వీకరణ ఆలస్యంపై తీవ్రంగా స్పందించారు ఆప్ నేతలు. టోకెన్ల వ్యవహారం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.
"35 మంది అభ్యర్థుల దగ్గర సరైన పత్రాలే లేవు. ప్రతిపాదించేందుకు వారి వెంట 10 మంది కూడా లేరు. వారి పత్రాలు పరిశీలించేవరకు కేజ్రీవాల్‌ను నామినేషన్ వేయనీయమని వారు చెబుతున్నారు. ఇక్కడ ఏదో కుట్ర ఉంది. భాజపా ఎన్ని కుట్రలు చేసినా... కేజ్రీవాల్ నామినేషన్ వేయకుండా, 3వ సారి సీఎం కాకుండా అడ్డుకోవడం మీ తరం కాదు" అని మండిపడ్డారు ఆప్ నేతలు మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్.
దిల్లీలోని 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11న ఫలితం వెలువడనుంది.