ఉన్నావ్ అత్యాచార బాధితురాలి మృతిపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి సంతాపం తెలియజేశారు.
"నిందితులందరినీ పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరుగుతుంది. తప్పుచేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది." - యోగీ ఆదిత్యనాథ్, ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి
న్యాయం చేయండి..
23 ఏళ్ల ఉన్నావ్ బాధితురాలి మరణం చాలా బాధాకరమని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. వారి కుటుంబానికి బీఎస్పీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. బాధితురాలి కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చూడాలని ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని మాయావతి కోరారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి బాధాకరమైన ఘటనలు జరగకుండా నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకురావాలని ఆమె కోరారు. వీలైనంత త్వరగా దోషులకు ఉరిశిక్ష పడేలా చూడాలని అభిప్రాయపడ్డారు.
గతేడాది ఇద్దరు వ్యక్తులు ఉన్నావ్ బాధితురాలిపై అత్యాచారం చేశారు. అయితే కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్తున్న ఆమెకు ఐదుగురు వ్యక్తులు నిప్పంటించారు. మెరుగైన చికిత్స కోసం వెంటనే ఆమెను విమానంలో దిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి అధికారులు తరలించారు. అయితే 90 శాతం కాలిన గాయాలతో శుక్రవారం రాత్రి ఆమె మరణించింది.
ఇదీ చూడండి: అమ్మాయిల్ని అల్లరి చేసినందుకు యువకుడికి దేహశుద్ధి!