ఉన్నావ్ అత్యాచార బాధితురాలి పోస్టుమార్టం నివేదిక వెల్లడించారు దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి వైద్యులు. శుక్రవారం రాత్రి గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించినప్పటికీ.. కాలిన గాయాలతోనే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలో తేలింది. 90 శాతం మేర శరీరం అగ్నికి ఆహుతవటం వల్లే పరిస్థితి విషమించి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
" పోస్టుమార్టం నివేదిక ప్రకారం బాధితురాలి శరీరం పూర్తిగా కాలిపోవటం వల్ల ప్రాణాలు కోల్పోయింది. శరీరంలోకి ఏదైన గుచ్చుకున్నట్లు గానీ, విషం వల్లగానీ లేదా ఊపిరి ఆడకుండా మరణించినట్లు పోస్టుమార్టంలో కనిపించలేదు."
- సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి సీనియర్ వైద్యుడు.
గుండెపోటని ప్రకటన
శుక్రవారం రాత్రి ఉన్నావ్ బాధితురాలు గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు వైద్యులు. తమ శాయశక్తులా ప్రయత్నించినా యువతిని బతికించలేకపోయామని.. సాయంత్రం ఆమె పరిస్థితి విషమంగా మారిందని తెలిపారు. 11.10 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచిందని వెల్లడించారు.
ఉన్నావ్‌లో అంత్యక్రియలు..
యువతి మృతదేహాన్ని ఆమె స్వగ్రామం ఉన్నావ్‌కు అంబులెన్స్‌లో తరలించారు అధికారులు. మరికాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితులను ఉరి తీయటమో, ఎన్కౌంటర్ చేయటమో జరిగితేనే తమ సోదరికి న్యాయం జరిగినట్లని పేర్కొన్నారు యువతి సోదరుడు.
5వ తేదీన ఘటన..
ఈనెల 5న ఐదుగురు దుండగులు అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో ప్రాణాలతో పోరాడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడించారు.
ఇదీ చూడండి: 'ప్రపంచ అత్యాచారాల రాజధానిగా భారత్'