కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప దేవాలయం ఇవాళ సాయంత్రం 5 గంటలకు తెరుచుకోనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. అత్యవసర వైద్య కేంద్రాలను ఏర్పాటుచేస్తోంది. అయితే ఆలయ ప్రవేశాన్ని కోరుకునే మహిళలు కచ్చితంగా 'కోర్టు అనుమతి' తీసుకోవాలని స్పష్టం చేసింది.
సంప్రదాయం ప్రకారం యుక్త వయస్సులో ఉండే మహిళలు అయ్యప్ప స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. ఇతర మతాల్లోనూ ఇలాంటి సంప్రదాయాలే ఉన్నాయని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. వీటన్నింటిపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించింది. అందుకే ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నెలకొన్న వివాదానికి సంబంధించిన పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.
సుదీర్ఘ తీర్థయాత్ర
నవంబర్ 16 సాయంత్రం 5 గంటలకు తాంత్రి (ప్రధాన పూజారి) కందారు మహేశ్ మోహనారు, ముఖ్య పూజారి ఏకే సుధీర్ నంబూద్రి కలిసి అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తారు. అప్పటి నుంచి డిసెంబర్ 27 వరకు శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో నిత్యపూజలు జరుగుతాయి. స్వామివారి భక్తులు దేశం నలుమూలల నుంచి తరలివచ్చి ప్రత్యేకపూజలు చేస్తారు.
నిరసనలకు తావులేదు..
శబరిమల సంప్రదాయాలను అతిక్రమించే ఎలాంటి చర్యలను సహించబోమని కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ స్పష్టం చేశారు. మందిర ప్రవేశం కోసం చేసే అనవసర ప్రచారాలను ప్రభుత్వం సహించబోదని తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున.. మహిళలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించే అవకాశం ఏదీ లేదని ఆయన తేల్చిచెప్పారు. కేవలం ప్రచారం కోసం.. ఆలయ ప్రవేశం కోరే మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించదని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై సీబీఐ కేసు